తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌ వాసులకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం - మేడ్చల్‌, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు - HYDERABAD METRO RAIL EXTENSION

కొత్తగా రెండు డీపీఆర్‌ల తయారీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తెలంగాణ సర్కారు - ప్యారడైజ్‌ నుంచి మేడ్చల్‌ వరకు 23 కిలోమీటర్లు - జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు 22 కిలోమీటర్లతో ప్రతిపాదనలు

METRO RAIL EXTENSION
HYDERABAD METRO GOOD NEWS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 10:06 PM IST

Hyderabad Metro Rail Extension : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ వాసులకు తీపి కబురును అందించింది. హైదరాబాద్‌ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్‌ కల త్వరలో సాకారమయ్యే దిశగా అడుగులు పడబోతున్నాయి. భాగ్యనగర నార్త్‌ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా సీఎం రేవంత్‌రెడ్డి ప్యారడైజ్‌- మేడ్చల్‌ 23 కిలోమీటర్లు, జేబీఎస్‌-శామీర్‌పేట్‌ 22 కిలోమీటర్ల రెండు మెట్రో కారిడార్ల డీపీఆర్‌(వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక)ల తయారీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

వీలైనంత తొందరగా డీపీఆర్‌లను సిద్ధం చేసి మెట్రో రైల్‌ ఫేజ్‌-2 ‘బి’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని హెచ్ఎం‌ఆర్‌ఎల్‌ (హైదరాబాద్ మెట్రో రైల్‌ లిమిటెడ్) ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డిని ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎం‌ఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ తయారీ విషయంపై చర్చించి ఈ క్రమంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.

రెండు కారిడార్లు : ప్యారడైజ్‌ మెట్రో స్టేషన్‌ నుంచి తాడ్‌బండ్‌, గుండ్లపోచంపల్లి, బోయిన్‌పల్లి, సుచిత్ర సర్కిల్‌, కొంపల్లి, కండ్లకోయ, ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ మీదుగా మేడ్చల్‌ వరకు దాదాపు 23 కిలోమీటర్ల వరకు ఈ కారిడార్‌ ఉంటుంది. జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి విక్రమ్‌పురి, ఆల్వాల్‌, బొల్లారం, హకీంపేట్‌, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట తూముకుంట, ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ మీదుగా శామీర్‌పేట్‌ వరకు 22 కిలోమీటర్ల ప్రతిపాదనల మేరకు ఈ కారిడార్‌ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డికి వివరించారు.

సూచనలు, సలహాలు : తాను మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ట్రాఫిక్‌ సమస్యలు, ఈ కారిడార్ల రూట్‌ మ్యాప్‌లపై తనకు మంచి అవగాహన ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి చర్చలో ప్రస్తావించారు. రూట్‌ మ్యాప్‌ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి పార్లమెంట్‌ సభ్యులు ఈటల రాజేందర్‌కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలు తీసుకోవాలని మెట్రో ఎండీని సీఎం ఆదేశించారు.

డీపీఆర్‌ను త్వరితగతిన 3 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని సీఎం సూచించినట్టు మెట్రో ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో ఫేజ్‌-2 ‘ఏ’ భాగం మాదిరిగానే ‘బి’ భాగాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టుగా రూపొందించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించాలని ఆదేశించారని, ఈ మేరకు వెంటనే డీపీఆర్, అలాగే వాటికి కావాల్సిన ఇతర డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నట్టు మెట్రో ఎండీ వివరించారు.

గజానికి రూ.81 వేల పరిహారం - పాతబస్తీ మెట్రోకు ఆస్తుల సేకరణ షురూ

5 కి.మీ నాగోల్​ - ఎల్బీనగర్​ మెట్రో లింక్​కు ప్రాధాన్యం​ - ఇది పూర్తయితే సాఫీ ప్రయాణమే

ABOUT THE AUTHOR

...view details