తెలంగాణ

telangana

జోరువానలకు ఉమ్మడి మెదక్‌, పాలమూరు జిల్లాలు అతలాకుతలం - నేడు రెడ్‌ అలర్ట్ జారీ - TELANGANA RAINS 2024

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 8:37 AM IST

Updated : Sep 2, 2024, 9:02 AM IST

Telangana Rains 2024 : జోరువానలకు ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్‌ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. చెరువులు, వాగులు ఉప్పొంగుతుండగా ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీగా వరద తాకిడికి పంట పొలాలు నీటమునిగాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా దుందుభి నదిలో కొట్టుకుపోయిన గొర్రెల కాపరులను నాటు పడవలతో రక్షించారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

Heavy Rains in Medak District
Telangana Rains 2024 (ETV Bharat)

Heavy Rains in Medak District : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 15 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మెదక్‌ జిల్లాలో హల్దీవాగు, పసుపులేరు, పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కంచనపల్లిలో వరద ప్రవాహానికి వరి పొలాల్లో మట్టి మేటవేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని గర్భగుడి ముందు పాయ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో దేవస్థానంలోకి భక్తులు వెళ్లకుండా మూసేశారు.

వర్షాలతో కూలిన ఇల్లు :శివ్వంపేటలో బాలయ్య అనే వ్యక్తి ఇల్లు కూలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గజ్వేల్‌ మండలం జాలిగామ పెద్ద చెరువులోకి వెళ్లాల్సిన కాలువ నీరు గ్రామంలోకి చేరి చెరువును తలపిస్తోంది. మిరుదొడ్డి మండలంలో వాగులు ఉప్పొంగడంతో పంట పొలాలు మునిగాయి. కూడవెల్లి వాగు వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కుండపోత వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో జహీరాబాద్‌లోని నారింజ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు 4వేల 300 క్యూసెక్కుల వరద వస్తుండగా మూడో గేటు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఆందోల్‌ పరిధిలోని జాతీయ రహదారి-161 రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాలు : ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుణుడు ప్రతాపం చూపించాడు. మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో జోగులాంబ గద్వాల జిల్లా రామాలయంలోకి నీరు చేరింది. నారాయణపేట జిల్లా పగిడిమారీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి వాగులో కొట్టుకుపోయాడు. వాగు మధ్యలో ఓ చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతుండగా గ్రామస్థులు జేసీపీ సాయంతో కాపాడారు. జడ్చర్లలో జలమయమైన రాజీవ్‌నగర్‌, పద్మావతి కాలనీలలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పర్యటించారు.

తాండూరు, మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై పర్సాపూర్‌ గ్రామశివారులో నిర్మాణంలోని కల్వర్టు చుట్టూ భారీగా వరద చేరింది. పక్కనే ఉన్న మట్టి రోడ్డు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌లో జలమయమైన పలు కాలనీలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా సిర్సవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు ఆంజనేయులు, చిన్న మల్లయ్య దుందుభి వాగులో చిక్కుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ రఘునాథ్‌ సోమశిల నుంచి నాటు పడవలు, మత్య్సకారులను తెప్పించారు. డ్రోన్‌ సహాయంతో గొర్రెల ఆచూకీ కనిపెట్టి వారిని రక్షించారు.

ఉమ్మడి మెదక్​ జిల్లాలో వరుణుడి బీభత్సం - అత్యవసర సేవలకై ప్రత్యేక టోల్​ఫ్రీ నంబర్​ ఏర్పాటు - Heavy Rains in Medak District

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో దంచికొడుతున్న వానలు- ఎక్కడికక్కడ నిలిచిపోయిన రాకపోకలు - heavy rains in joint Mahabubnagar

Last Updated : Sep 2, 2024, 9:02 AM IST

ABOUT THE AUTHOR

...view details