Hero Sai Durga Tej On Social Media Posts : ఈ డిజిటల్ యుగంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు సోషల్ మీడియా చూడకుండా ఆ రోజు గడవడం లేదు. అంతలా సామాజిక మాధ్యమాలు మన జీవితాల్లోకి ప్రవేశించాయి. ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ ఇతర వేదికల ద్వారా అభిరుచులు, ఇతర సంతోషకరమైన ఘటనలను అందిరితో పంచుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది వాటిని ఆయా వేదికల ద్వారా పోస్ట్ చేస్తున్నారు.
చిన్నారుల ఫొటోలు, వీడియోలు షేర్ చేయవద్దు :అయితే కొన్నిసార్లు సోషల్ మీడియా పోస్టుల్లో చిన్నారులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఉంటున్నాయి. అవి కొన్నిసార్లు దుర్వినియోగమవుతున్నాయి. అందువల్ల చిన్నారులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయకపోవడమే మంచిదని మెగా హీరో హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వినోదం పేరుతో చిన్నారులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖులను ఎక్స్ వేదికగా కోరారు.
సోషల్ మీడియా ప్రపంచం ప్రమాదకరంగా మారింది :తల్లిదండ్రులు తమ పిల్లల వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై మెగా హీరో సాయి దుర్గాతేజ్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్రపంచం ప్రమాదకరంగా మారిపోయిందని తెలిపారు. అందుకే పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేసే ముందు తల్లిదండ్రులు కొంత ఆలోచించాలని సూచించారు. సోషల్ మీడియాలో కొందరు మృగాళ్లు ఉంటారని, వినోదం పేరిట పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.