Medical Student Lost Life in Vizianagaram District : ‘అమ్మ, నాన్నా, తమ్ముడూ నన్ను క్షమించండి. పదేళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా. ఎంత కష్టపడి చదువుదామన్నా చదవలేక పోతున్నా. రకరకాల ఆలోచనలు. ఎందుకు బాధపడతానో తెలియదు. ఎందుకు సంతోషంగా ఉంటానో తెలియదు. ఆందోళన, కోపం, భయం ఎందుకు ఎక్కువై పోతున్నాయో తెలియడం లేదు. గత 8-9 నెలల నుంచి ఆత్మహత్య ఆలోచనలు తినేస్తున్నాయ్. ఎవరికీ చెప్పలేను. నాకు నేనే పిచ్చోడిలా అనిపిస్తున్నా. బతకాలంటే భయమేస్తోందమ్మా. నా కోసం మీరు ఎంతో చేశారు. మీ ముగ్గురే నా జీవితం. ఇంకా ఎంత కాలం బాధ పెడతా. నన్ను క్షమించండి.
ఇదీ ఓ వైద్య విద్యార్థి ఆవేదనతో కూడిన ఆత్మహత్య లేఖ. రాసిన ప్రతి వాక్యం కంటతడి పెట్టిస్తోంది. బతికి వైద్యుడిగా పదిమందికి ప్రాణం పోయాల్సిన వ్యక్తి ఊపిరి తీసుకున్నాడు. చదువుల ఒత్తిడి జీవితాన్ని చిత్తు చేసింది. నెల్లిమర్ల పోలీసు వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడేనికి చెందిన ఆత్కూరి సాయి మణిదీప్(24) విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని మిమ్స్ వైద్య కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు.
కిస్తీలు కట్టాలని ఫైనాన్స్ కంపెనీ వేధింపులు - దంపతుల బలవన్మరణం
రెండో ఏడాదికి సంబంధించిన కొన్ని పరీక్షలు ఇంకా ఉండడం, తన స్నేహితుల చదువు మార్చి నాటికి పూర్తయ్యి వారంతా వీడ్కోలు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటుండటం, ఇతర కారణాలతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. చదువుపై ఏకాగ్రత చూపించలేక మనస్తాపం చెంది ఆదివారం తెల్లవారుజామున పురుగు మందు తాగి మృతిచెందాడు. ఉదయం 10 గంటలు దాటినా కళాశాల వసతి గృహం గది నుంచి బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. తలుపులు పగలగొట్టి చూసేసరికి మణిదీప్ మృతిచెంది ఉన్నాడు. గదిలో ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వైద్యుడై వస్తావనుకుంటే :సాయి మణిదీప్ ఇక లేడన్న వార్త తెలిసి ఆయన తల్లిదండ్రులు, తమ్ముడు కన్నీరు మున్నీరవుతున్నారు. డాక్టరై ఇంటికి వస్తావనుకున్నాం, ఎంతో కష్టపడి చదివిస్తున్నాం కానీ ఇలా మాకు దూరమవుతావని, గుండె కోత మిగులుస్తావని కలలో కూడా ఊహించలేదంటూ తల్లిదండ్రులు ఆత్కూరి రామారావు, శిరీష గుండె పగిలేలా రోదిస్తున్నారు.
వారిని ఓదార్చడం కష్టంగా మారింది. రామారావు స్వగ్రామం నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కాగా ప్రస్తుతం సమిశ్రగూడెం నుంచి అట్లపాడు వెళ్లే రహదారిలో నివసిస్తున్నారు. సమిశ్రగూడెంలో వికాస్, విజ్ఞాన్ పాఠశాల, కళాశాలల్లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నెల్లిమర్ల ఎస్సై గణేష్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి పెదనాన్న గౌరీ చక్రధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ప్రధానోపాధ్యాయుడిని బలిగొన్న స్నేహం - సూసైడ్ నోట్లో దారుణ విషయాలు