AP Students Arrested in China: చైనాలో జైలు శిక్ష అనుభవిస్తోన్న తమ కుమారుల నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు బెయిల్ మంజూరు చేయించాలంటూ తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ విద్యార్థి తండ్రి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబ సభ్యులు కలిశారు.
చైనాలోని జియాన్ సిటీలో MBBS చేసిన విద్యార్థులు ఇంటర్న్ షిప్ కోసం సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో అత్యాచారం చేశారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాది మార్చి 31న వారిని అరెస్టు చేశారు. కోర్టులో విచారణ తర్వాత ఏపీ విద్యార్థికి 11 ఏళ్లు, తమిళనాడు విద్యార్థులు ఒక్కరికి పదిన్నర సంవత్సరాలు, మరొకరికి 10 ఏళ్ల శిక్ష విధించారు.
అరెస్టు జరిగిన నెల వరకు విద్యార్థుల నుంచి ఫోన్లు రాక తల్లిదండ్రులు కంగారుపడ్డారు. చివరికి ఓ విద్యార్థి తల్లి మీనాక్షి వైద్య కళాశాల వారిని సంప్రదించగా క్రిమినల్ కేసులో అరెస్టు అయినట్లు మాత్రమే చెప్పారు. వెంటనే చైనా వెళ్లి జైలు వద్దకు వెళ్లగా విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా రావాలని పంపించివేశారు. వీరు గత ఏడాది నుంచి కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలను కలుసుకుంటూ వస్తున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘాన్నీ ఆశ్రయించారు. ఈ క్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, అగ్రనేతల చొరవతో వీరు ఈ ఏడాది మేలో చైనా దేశానికి వెళ్లి, జైల్లో ఉన్న వైద్య విద్యార్థులను కలుసుకున్నారు.