High Tension at Mohan Babu University : తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర టెన్షన్ వాతావరణానికి ఫుల్స్టాప్ పడింది. తాత, నాన్నమ్మలకు నివాళులర్పించేందుకు వచ్చిన మంచు మనోజ్ దంపతులను పోలీసులు రెండుసార్లు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ తర్వాత పోలీసుల జోక్యంతో మంచు మనోజ్ దంపతులు వర్సిటీ లోపలికి వెళ్లి తాత, నాన్నమ్మల సమాధులకు నివాళులర్పించారు.
అనంతరం బయటకు వచ్చిన మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. తనను అడ్డుకునేందుకు పలు ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకువచ్చారన్నారు. అయితే తాను రౌడీలను చూసి వెళ్లడం లేదని, పోలీసుల మాట మీద గౌరవంతో వెళ్తున్నానని చెప్పారు. కోర్టు నోటీసులు తనకు అందలేదని పేర్కొన్నారు.
"కోర్టు నోటీసులు నాకు అందలేదు. నేను వస్తున్నానని దిల్లీ సహా వివిధ ప్రాంతాల నుంచి రౌడీలను రప్పించారు. పోలీసు లాఠీలను రౌడీలు పట్టుకుని తిరుగుతున్నారు. బౌన్సర్లు ఉండవద్దని ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. నాకు ప్రవేశం లేదని పోలీసులు నోటీసులు చూపించారు. నాకు నోటీసులు అందలేదు. నేను రాకూడదని నోటీసులున్నట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల మాట మీద గౌరవంతో వెనక్కి వెళ్తున్నా. రౌడీలను చూసి నేను వెనక్కి వెళ్లట్లేదు." - మంచు మనోజ్, సినీ నటుడు
ఉదయం మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ర్యాలీతో చేరుకున్నారు. ఈ క్రమంలో కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల సూచనతో వెనుదిరిగిన మనోజ్ నేరుగా నారావారిపల్లె వెళ్లారు. ఆ పర్యటన అనంతరం మళ్లీ వర్సిటీ దగ్గరకు రాగా పోలీసులు అడ్డుకున్నారు.
తాత, నానమ్మ సమాధుల వద్ద నివాళులర్పించేందుకు వచ్చానని మంచు మనోజ్ పోలీసులకు తెలిపారు. తాత, నానమ్మకు నివాళులర్పించేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. అయితే కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా అనుమతించలేమని పోలీసులు మనోజ్‌కి వివరించారు. అవ్వ, తాత సమాధుల వద్దకు అనుమతించరా అంటూ మనోజ్ ప్రశ్నించారు. గేట్లు తీయాలంటూ గట్టిగా కేకలు వేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Manoj Meets Lokesh : ఉదయం మోహన్‌బాబు వర్సిటీలోనికి అనుమతించకపోవడం వల్ల అక్కడినుంచి వెళ్లిపోయిన మంచు మనోజ్ నారావారిపల్లెలో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. భార్య మౌనికతో కలిసి లోకేశ్‌తో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. అనంతరం ఎ.రంగంపేటలో జరుగుతున్న పశువుల పండగలో మంచు మనోజ్ దంపతులు పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా వారు మరోసారి మోహన్‌బాబు వర్సిటీకి వచ్చారు.
మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద భారీ బందోబస్తు : మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే యూనివర్సిటీలో మోహన్‌బాబు, మంచు విష్ణు ఉన్నారు. ఈ క్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. గేట్లను కూడా మూసివేశారు.
చట్టం తన పని తాను చేస్తుంది - బహిరంగంగా ఎవ్వరూ స్పందించొద్దు : మంచు విష్ణు
మంచు మోహన్‌బాబు కుటుంబంలో మళ్లీ వివాదం - విష్ణుపై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు