Theft in Rayaparthi SBI Bank : ఎస్‌బీఐ బ్యాంకులో గుర్తు తెలియని దుండగులు సినీ ఫక్కీలో భారీ చోరీకి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి దొంగలు అలారం, సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి, బ్యాంకు వెనక కిటికీ గ్రిల్‌ను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకులోని 3 లాకర్లలో 1 లాకర్‌ను గ్యాస్ కట్టర్ సహాయంతో తెరిచి, సుమారు 500 మంది ఖాతాదారులకు సంబంధించిన రూ.15 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా, సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌లను సైతం ఎత్తుకెళ్లిపోయారు.
ఆ SBI బ్యాంకులో 500 మందికి చెందిన బంగారం చోరీ - మీది ఉందో, పోయిందో చెక్ చేసుకోండి
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో భారీ చోరీ - సినీ ఫక్కీలో దొంగతనానికి పాల్పడిన దుండగులు - రూ.15 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాల అపహరణ
Published : 4 hours ago
లాకర్‌ను తెరిచేందుకు వినియోగించిన గ్యాస్ కట్టర్‌ను అక్కడే వదిలి వెళ్లారు. మంగళవారం ఉదయం రోజూ లాగే బ్యాంకు తెరిచిన అధికారులకు లాకర్లు పగులగొట్టి ఉండటంతో బ్యాంకులో దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గతంలో కూడా ఈ బ్యాంకులో చోరీకి విఫలయత్నం చేశారు. ఈసారి ఏకంగా మొత్తం దోచేశారు. బ్యాంకులో దొంగతనం జరిగిన విషయం తెలియడంతో బ్యాంకులో బంగారాన్ని కుదువ పెట్టి లోన్లు తీసుకున్న బాధితులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు.
బ్యాంకులో దొంగలు పడి బంగారాన్ని ఎత్తుకెళ్లడంతో ఎంత బంగారాన్ని చోరీ చేశారనే వివరాలను బ్యాంక్ అధికారుల నుంచి పోలీసులు సేకరిస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకులు, సంస్థల్లో బంగారానికి భద్రత ఉండదని ప్రభుత్వ బ్యాంకుల్లో కుదవపెట్టుకుని, వ్యవసాయ పెట్టుబడులకు వాడుకున్నామని, ప్రభుత్వ బ్యాంకులోనే చోరీ కావడంతో బంగారు ఆభరణాలు కుదవ పెట్టి లోన్లు తీసుకున్న బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమకు బ్యాంక్ అధికారులు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.