Pennepalli Fire Accident Today : తిరుపతి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి పెళ్లకూరు మండలం పెన్నేపల్లిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చేలరేగాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అగ్ని జ్వాలలు వ్యాపించాయి. దీంతో కార్మికులు హాహాకారాలు పెడుతూ బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడ్డారు. ఫర్నిచర్ యూనిట్ మంటల్లో కాలిబూడిదైంది. ప్రమాదం జరిగినప్పుడు 20 మంది విధుల్లో ఉన్నారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఘటనా స్థలానికి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. మరోవైపు పరిశ్రమ ప్రతినిధులు ప్రాణనష్టం జరగలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. జరిగిన విషయాన్ని బయటకు రాకుండా చేస్తున్నారని విమర్శించారు.