Massive Encounter in Mulugu District :మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్వాడ్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మావోయిస్టులు మృతి చెందారు.
మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు సమాచారం. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్నతో పాటు అతని దళ సభ్యులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న(35), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23), మల్లయ్య అలియాస్ మధు (43), జైసింగ్ (25), కామేశ్ (23), కిశోర్ (22) ఉన్నట్లు సమాచారం.
ఇద్దరు అమాయకులను చంపారు :ఎన్‌కౌంటర్‌పై ములుగు ఎస్పీ షబరీష్ వివరాలు వెల్లడించారు. 'వాజేడులో ఇద్దరు అమాయకులను మావోయిస్టులు చంపారని ఎస్పీ పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచామన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ టీమ్‌కు 10 నుంచి 15 మంది మావోయిస్టులు కనిపించారని, వారు పోలీసులను చూసి కాల్పులు జరిపారని తెలిపారు. లొంగిపోవాలని పలుమార్లు హెచ్చరించినా కాల్పులు ఆపకపోవడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు. కాల్పుల తర్వాత వెతకగా, ఏడుగురు చనిపోయినట్లు గుర్తంచామని చెప్పారు. ఇలాంటి ఘటనలను అరికట్టడానికి జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్ పెంచినట్లు స్పష్టం చేశారు.
అడవుల్లో అలజడి - ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు - భయాందోళనలో గిరిపుత్రులు