Police Notices to MLA Kaushik Reddy :బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పోలీసులు ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే రేపు కరీంనగర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని, అందువల్ల ఎల్లుండి విచారణకు హాజరవుతానని కౌశిక్ రెడ్డి తెలిపారు. దీంతో 17న విచారణకు హాజరు కావాలని మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. డిసెంబర్ 4న తన ఫోన్ ట్యాప్ అవుతుందని బంజారాహిల్స్ పీఎస్‌కి తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి వచ్చారు.
కౌశిక్ రెడ్డి హల్‌చల్ : అదే సమయంలో స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్న బంజారాహిల్స్ ఇన్స్‌పెక్టర్ రాఘవేందర్ వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి అనుచరులతో కలిసి పీఎస్‌లో కౌశిక్ రెడ్డి హల్‌చల్ చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై గతంలో కేసు నమోదైంది. ఫిర్యాదు దారుడు బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ కావడంతో దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరుశురామ్ ను ఉన్నతాధికారులు నియమించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు లో భాగంగా మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ నోటీసులు జారీ చేశారు.
ఉరి తీయండి! : తనపై అన్యాయంగా కేసులు పెడితే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ శిక్షణ ఇచ్చిన బిడ్డను ఏ మాత్రం భయపడను అని స్పష్టం చేశారు. తాను తప్పు చేసినట్లు రుజువైతే ఉరి తీయండని సవాల్ విసిరారు. తన అరెస్టు, కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజాగా ఇవాళ తనకు మళ్ళీ పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపారు.