Margadarsi MD Shailaja Kiron Visits Katuri Art Gallery:ఇనుము, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను పునర్వియోగించే పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఆమె సందర్శించారు. 2 సంవత్సరాల క్రితం కన్నుమూసిన తన తండ్రి సుందరనాయుడు విగ్రహం తెనాలి కాటూరి శిల్పశాలలో తయారవుతోంది. విగ్రహం తుదిరూపును పరిశీలించి కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. విగ్రహం చాలా బాగా తయారైందని శిల్పులను అభినందించారు. ఆర్ట్ గ్యాలరీలోని విగ్రహాలను తిలకించారు.
అనంతరం వార్తశృంగ పేరుతో కాటూరి శిల్పులు రూపొందించిన ఆధునిక తరహా శిల్పాన్ని శైలజా కిరణ్ ఆవిష్కరించారు. శిల్ప కళలో 3D పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ శిల్పాన్ని రూపొందించారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆధునిక ఆలోచనలతో విగ్రహాలు, శిల్పాలు రూపొందిస్తున్న కాటూరి కుటుంబ సభ్యులను అభినందించారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలోని విగ్రహాల్లో జీవకళ ఉట్టిపడుతోందని శైలజా కిరణ్ ప్రశంసించారు.
తెనాలికి ఉన్న పేరును నిలబెట్టేందుకు ఇక్కడి కళాకారులు కృషి చేస్తున్నారని శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా శిల్ప కళలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని వార్తశృంగ శిల్పాన్ని రూపొందించినట్లు శిల్పి శ్రీహర్ష తెలిపారు. తమ ఆర్ట్ గ్యాలరీని శైలజా కిరణ్ వంటి ప్రముఖులు సందర్శించడం సంతోషంగా ఉందన్నారు.