తెలంగాణ

telangana

ETV Bharat / state

పూజారికాంకేర్‌ ఎన్‌కౌంటర్‌ మృతుల్లో తెలంగాణ కీలక నేతలు? - మావోయిస్టుల లేఖ - PUJARIKANKER ENCOUNTER UPDATE

పూజారికాంకేర్‌ ఎన్‌కౌంటర్‌ మృతుల్లో తెలంగాణ నేతలు! - రాష్ట్ర కమిటీ ఇన్‌ఛార్జి దామోదర్‌ ఉన్నట్లు ప్రచారం - మావోయిస్టు సౌత్‌ బస్తర్‌ డివిజన్‌ కమిటీ పేరిట లేఖ - ధ్రువీకరించని తెలంగాణ పోలీసులు

DAMODHAR
Pujarikanker Encounter (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2025, 6:44 AM IST

Maoist's Letter on Pujarikanker Encounter : మావోయిస్టు తెలంగాణ కమిటీ ఇంఛార్జీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారనే వార్త కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారికాంకేర్ ప్రాంతంలో ఈ నెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్ మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట లేఖ విడుదలైంది. తెలంగాణ నిఘా విభాగం మాత్రం ఆ సమాచారాన్ని ధ్రువీకరించలేదు. లేఖపై అనుమానాలు వ్యక్తం చేయడంతో సందిగ్ధం నెలకొంది.

ఛత్తీస్‌గఢ్‌ పూజారికాంకేర్ ప్రాంతంలో ఈ నెల 16న ఎన్‌కౌంటర్‌ జరిగింది. 12 మంది మృతదేహాలను పోలీసులు అదే రోజు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని మృతదేహాలను మావోయిస్టులు తీసుకెళ్లారని పోలీసులు భావించారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ పేరిట లేఖ విడులైంది. దామోదర్‌తో పాటు పార్టీ ప్లాట్‌ఫాం కమిటీ మెంబర్లు హంగీ, దేవే, జోగా, నర్సింహారావు మృతి చెందినట్లు లేఖలో పేర్కొన్నారు. పూజారికాంకేర్ ఎన్‌కౌంటర్​లో మొత్తం 18 మంది మరణించినట్లు మావోయిస్టులు ఆ ఉత్తరంలో ప్రకటించారు.

యాక్షన్‌ టీమ్‌కు ఆయనే నేతృత్వం : మావోయిస్టులు చనిపోయినట్లు లేఖలో పేర్కొన్న బడే దామోదర్, ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన వారు. 3 దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. దూకుడుగా వ్యవహరిస్తారనే పేరున్న దామోదర్‌కు తెలంగాణ ఏర్పడిన తర్వాత మావోయిస్టు రాష్ట్ర కమిటీకి మిలిటరీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి యాక్షన్‌ టీమ్‌కు ఆయనే నేతృత్వం వహించారు. కరోనా సమయంలో 2021 జూన్‌లో అప్పటి రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో పార్టీలో చర్చ జరిగింది.

కొయ్యడ సాంబయ్య ఆలియాస్ ఆజాద్‌తో పాటు దామోదర్ పేరును పరిశీలించారు. అయితే ఆజాద్ సీనియర్ కావడం, దామోదర్‌కు దూకుడు స్వభావం కలిగి ఉండటం లాంటి కారణాలతో ఇద్దరిలో ఎవరినీ నియమించలేదు. కేంద్ర కమిటీ సభ్యుడు, ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి చంద్రన్న మార్గ దర్శకత్వంలోనే రాష్ట్ర కమిటీ పని చేయాలని నిర్ణయించారు. సుదీర్ఘ కాలం తర్వాత ఇటీవలే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇంఛార్జిగా చొక్కారావును నియమించినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలోనే కొనసాగిన దామోదర్ భార్య రజితను తెలంగాణ పోలీసులు 2023లో ఛత్తీస్​గఢ్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. దామోదర్ సోదరుడు బడే నాగేశ్వరరావు సైతం పీపుల్స్ వార్ పార్టీలో పని చేసి ఎన్‌కౌంటర్​లో మృతి చెందారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మృతి చెందారు.

నిర్ధారించని నిఘా వర్గాలు : మరోవైపు ఛత్తీస్‌గఢ్ పోలీసులు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల్లో 10 మంది మావోయిస్టులను గుర్తించామని, వారిపై రూ.59 లక్షల రివార్డున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ ప్రకటించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన నర్సింహారావు ఉన్నట్లు ప్రకటించారు. ఆయనపై రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. దామోదర్ మృతి చెందినట్లు మావోయిస్టులు తమ లేఖ ద్వారా అంగీకరించారని మాత్రమే ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ నిఘా వర్గాలు మాత్రం దామోదర్‌ మృతిని నిర్ధారించడం లేదు.

ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​- 12 మంది నక్సల్స్ హతం

ABOUT THE AUTHOR

...view details