తెలంగాణ

telangana

ETV Bharat / state

అడవుల్లో అలజడి - ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు - భయాందోళనలో గిరిపుత్రులు - MAOIST KILLED TWO PEOPLE IN MULUGU

ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇద్దరిని దారుణంగా చంపిన మావోయిస్టులు - పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నారని ఆరోపణ - మావోయిస్టుల చర్యలతో గిరిజనుల్లో భయాందోళన

MAOIST MURDERS IN MULUGU DISTRICT
Maoist killed Two People in Mulugu District (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2024, 9:00 PM IST

Maoist killed Two People in Mulugu District : ములుగు జిల్లాలో పోలీస్ ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఇద్దరు గిరిజనులను అత్యంత దారుణంగా హతమార్చారు. తమ కదలికలపై పోలీసులకు సమాచారమివ్వడం మానుకోవాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు లేఖలో మావోయిస్టులు వెల్లడించారు. ఉనికిని చాటుకోవడం కోసమే నక్సల్స్‌ ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరినీ దారుణంగా చంపడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక గిరిపుత్రులు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలులో పోలీసుల ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపేశారు.

మృతుల్లో ఒకరైన రమేశ్‌ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుండగా అదేగ్రామానికి చెందిన అర్జున్ అనే గిరిజనుడు నక్సల్స్‌ అకృత్యానికి బలయ్యాడు. సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు రెండు గ్రూపులుగా విడిపోయి ఇద్దరిని నరికి చంపినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఘటనలో అర్జున్ అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన భార్య పిల్లలు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు.

ఇన్‌ఫార్మర్లుగా మారి కొన్నేళ్లుగా మావోయిస్టు కదలికలను పోలీసులకు చేరవేస్తూ తమపై దాడులకు కారకులయ్యారంటూ విడుదల చేసిన లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఆ విషయంపై పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో హతమార్చినట్లు వాజేడు, వెంకటాపురం వాజేడు కమిటీ కార్యదర్శిశాంత పేరిట ఘటనాస్ధలిలో వదిలి వెళ్లిన లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. 2020 అక్టోబర్‌లో వెంకటాపురం మండల బీఆర్​ఎస్​ నాయకుడు భీమేశ్వరరావును సాయుధులైన నక్సల్స్‌ ఇంటికి వచ్చి నరికి చంపారు.

ఇన్‌ఫార్మర్ల పనిపట్టేందుకు : 2021 డిసెంబర్‌లో సూరవీడు మాజీ సర్పంచి కోరాసా రమేశ్‌ను అడవికి పిలిచి అక్కడే హతమార్చారు. 2022 నవంబర్‌లో బస్తర్ గుంపు గ్రామంలో గోపాల్‌ను దారుణంగా నరికి చంపారు. గత రెండేళ్లుగా ఈ తరహా ఘటనలు జరగలేదు. ఇటీవలే మావోయిస్టులను లక్ష్యంగా చేసుకొని భద్రతాదళాలు చేస్తున్న కూంబింగ్‌లో పలువురు నక్సల్స్‌ ప్రాణాలు కోల్పోయారు. తమ కదలికలపై సమాచారం చేరవేయడం వల్లే ఎన్‌కౌంటర్లలో చాలామంది మృత్యువాత పడ్డారని భావిస్తున్న నక్స్లల్స్‌ ఇన్‌ఫార్మర్ల పనిపట్టేందుకు సిద్ధమయ్యారు.

ఇన్‌ఫార్మర్లగా వ్యవహరించే వారిని మట్టుబెడితేనే గుట్టు కాపాడుకోగలమని మావోయిస్టులు భావిస్తూ దాడులకు తెగబడుతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత మరోసారి ఇద్దరిని హతమార్చడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఉనికిని చాటుకోవడం కోసమే మావోయిస్టులు అప్పుడప్పుడు ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ శబరీష్‌ వెల్లడించారు.

మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేకు వార్నింగ్ లెటర్ - అప్రమత్తమైన పోలీసులు

బీరు సీసాలో ల్యాండ్​మైన్, భద్రతా బలగాల కోసం మావోయిస్టుల ఎర

ABOUT THE AUTHOR

...view details