Heavy Rains in Vijayawada :ఎడతెరపిలేని వర్షం ఏపీలోని విజయవాడ నగరాన్ని జలమయం చేసింది. వన్‌టౌన్, గురునానక్ కాలనీ, చుట్టుగుంట, కృష్ణలంక, రామలింగేశ్వరనగర్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు సహా బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. నిర్మలా కాన్వెంట్ ప్రాంతం చెరువును తలపిస్తోంది.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఏపీఐఐసీ కాలనీ రోడ్డు నీట మునిగింది. మొగల్రాజపురంలో పాలి క్లినిక్ రోడ్డు జలమయమైంది. పాతబస్తీ పంజా సెంటర్లో మినార్ మసీదులోకి నీరు చేరింది. సింగ్‌నగర్‌లో ఇళ్లు మనిగాయి. బుడమేరు మధ్య కట్ట ప్రాంతంలోని గృహాలను వరద ముంచెత్తింది. రైల్వే వర్క్ షాప్‌లోకి నీరు చేరింది. ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం జలమయమైంది. కొండపల్లి రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది. విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు.
వర్షపు నీటిలో నెహ్రూ బస్‌స్టేషన్ : పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో వర్షపు నీరు నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టూటౌన్ కొత్తపేట పోలిస్ స్టేషన్ నీటిలో మునిగి పోయింది. రికార్డులు తడిచిపోయాయి. చాలాచోట్ల డ్రైన్లు పొంగి నీరు రోడ్లపైకి వస్తోంది. ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారి తటాకాన్ని తలపిస్తోంది.
మోటార్లతో వర్షపు నీరు బయటకు : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అనేక కాలనీల్లో నీరు నిలిచింది. స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధికారులతో వెళ్లి నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. మోటార్లను తెప్పించి వర్షపు నీటిని బైటకు పంపే ఏర్పాట్లు చేశారు. స్థానికులకు ఆహారం అందించాలని ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేశారు.
భారీ వర్షాల వల్ల నగరంలో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటిలో ఎక్కడికక్కడే కార్లు, బైకులు, బస్సులు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులపై వాహనాలు ముందుకు కదలక ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ద్విచక్రవాహనదారులు కిందకు దిగి బైక్‌ను తోసుకుంటూ వెళ్తున్నారు. మోకాళ్లలోతు నీటిలో ఇబ్బందులు పడుతున్నారు.
MP Kesineni Chinni on Heavy Rains :భారీ వర్షాల కారణంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అలెర్ట్‌గా ఉండి అవసరమైన సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోల్స్, కరెంట్ తీగల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన సూచించారు. పొంగే వాగులు, వంకల దగ్గర అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదీ పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఎంపీ కేశినేని చిన్ని పరిస్థితి సమీక్షిస్తున్నారు.
విజయవాడలో వర్షాల పరిస్థితిపై కంట్రోల్‌రూమ్‌లో కలెక్టర్ సృజన సమీక్షిస్తున్నారు. మొన్నటినుంచి కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాల వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. కొండప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం తగ్గి రోడ్లపై నీరు తగ్గేంతవరకు బయటకు ప్రజలు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో భారీ వర్షాలు - చెరువులుగా మారిన రహదారులు - ఇళ్లల్లోకి చేరిన వరద నీరు - Heavy Rains IN Telangana
అల్పపీడనం ప్రభావంతో దంచికొడుతున్న వర్షాలు - పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు - Heavy Rains in AndhraPradesh