Road Accident at Palnadu in AP :ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూరికి వచ్చారు. బంధుమిత్రులతో రెండు, మూడు రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు టిప్పరు రూపంలో దూసుకొచ్చి ఆరుగురు నిండు ప్రాణాలను బలిగొంది. కళ్లు తెరిచేలోపే అగ్నికీలలకు ఆహుతైన విషాదమిది. గాఢ నిద్రలో ఉన్న 20 వంది ప్రయాణికులను తీవ్ర గాయాలపాలుజేసింది.
స్థానికులు, క్షతగాత్రుల వివరాల మేరకు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వారే. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం - పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు చెలరేగి బస్సు దగ్ధం అయ్యింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి :ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. నీలాయపాలెంకు చెందిన కాశీ బ్రహ్మేశ్వరరావు (62), ఆయన భార్య లక్ష్మి (58), మనవరాలు శ్రీసాయి (9) దుర్మరణం పాలయ్యారు. క్షతగాత్రులను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు.
తేరుకునేలోపే తెల్లారిన బతుకులు : ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అంజి, మధ్యప్రదేశ్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ హరిసింగ్ మరో నలుగురు ఆహుతి అయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు.
బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిలకలూరిపేట నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ వర్క్ జరుగుతుండటం, తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం, టిప్పర్ వేగంగా దూసుకురావడం టిప్పర్ చోదకుడు వేగాన్ని నియంత్రించ లేకపోవడం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.