CM Revanth Davos Investment Tour :రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో వరస భేటీలు, చర్చలు జరుపుతోంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ యూనిలీవర్, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. పామాయిల్ యూనిట్‌కు యూనిలీవర్, రాకెట్ తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటుకు స్కైరూట్ మందుకొచ్చింది. జపాన్‌కు చెందిన ఎంటీసీ సానుకూలంగా స్పందించింది. గురువారం మధ్యాహ్నం వరకు దావోస్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెజాన్, సిఫీ టెక్నాలజీస్, సీఐఐ ప్రతినిధులతో చర్చలు జరపనుంది.
దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. మంగళవారం పలు కంపెనీల ప్రతినిధులుతో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ప్రముఖ బహుళ జాతి సంస్థ యూనిలీవర్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఆ కంపెనీ సీఈవో హీన్ షూమేకర్, చీఫ్ సప్లై చెయిన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు యూనిలీవర్ సంస్థ అంగీకరించింది.
స్కైరూట్ ఏరోస్పేస్‌తో ఎంవోయూ :రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ను ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో రాకెట్ తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్కైరూట్ ఏరోస్పేస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన సమావేశమయ్యారు.
అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ విజయం గర్వకారణమని సీఎం రేవంత్ ఆనందం వ్యక్తం చేశారు . తెలంగాణ యువకులు ప్రపంచస్థాయిలో ప్రతిభ ప్రదర్శించి రాష్ట్రంలోనే పెట్టుబడులకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. స్కైరూట్‌తో భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై ప్రభుత్వ వ్యూహాత్మక దృష్టిని చాటిచెబుతుందని సీఎం తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు పవన్ కమార్ అన్నారు.
తెలంగాణలో యూనిలివర్ పెట్టుబడులు - సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో పలు ఒప్పందాలు