Mango Farmers Suffering Huge Losses in Nellore District : ఫలాల్లో రారాజైన మామిడిని మధుర ఫలంగా పిలుస్తారు కాయను చూడగానే ధర చూడకుండా కొనేస్తారు. మామిడి తోటలు సాగు చేస్తున్న రైతుకు మాత్రం ఈ ఏడాది చేదును మిగిల్చింది. ప్రకృతిలో మార్పులు కారణంగా కొన్ని తోటల్లో ఈ ఏడాది కాపులేక పోవడంతో దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. నెల్లూరు మార్కెట్ లో వ్యాపారులు ధరలను నియంత్రిస్తూ రైతులు, వినియోగదారులను నష్టానికి గురిచేస్తున్నారు.
రూపాయికే కిలో మామిడి పండ్లు.. సాగు రైతుల కష్టాలు.. ఎక్కడంటే?
భారీగా తగ్గిన మామిడి పంట దిగుబడులు :నెల్లూరులోని మామిడి మార్కెట్లో రోజుకు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఈ ఏడాది మామిడి పంటలో 80శాతం దిగుబడి తగ్గింది. డిసెంబర్, జనవరి మాసాల్లో వచ్చిన ఈదురు గాలులకు పూత, పిందె రాలిపోయింది రైతులు వాపోయారు. ఏప్రిల్ నెలకి కొన్నితోటల్లో కాయలు అసలు కాయలేదు. ఎకరాకి కనీసం ఆరు టన్నులకు తగ్గకుండా కాయ దిగుబడి వస్తుంది. కొద్దిపాటి వర్షం కూడా లేకపోవటంతో పది ఎకరాలు సాగు చేసిన రైతుకు ఎకరాకి టన్ను కూడా దిగుబడి రాలేదు. లక్ష రూపాయలు ఖర్చు చేసి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ధరలు నియంత్రిస్తూ నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు :నెల్లూరులోని మార్కెట్‌కు నాలుగు జిల్లాల నుంచి మామిడి పంట వస్తుంది. చిన్నబజార్, పెద్దబజార్‌లో 60 వరకు దుకాణాలు ఉన్నాయి. సీజన్‌లో రోజుకు 3 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈసారి 80 శాతం మేర మామిడి దిగుబడి పడిపోవడంతో మార్కెట్‌కు రావాల్సిన పంట తగ్గింది. దిగుబడి భారీగా తగ్గినా మామిడి పంటకు ధర మాత్రం పెరగలేదు. మామూలు ధరలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు.