Police Questioned YSRCP Leaders :తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసుల్లో వైఎస్సార్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, న్యాయవాది గవాస్కర్ మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. వీరందరినీ పోలీసులు వేర్వేరుగా విచారించారు. శనివారం రాత్రి 8 గంటలకు విచారణకు వచ్చి జోగి రమేశ్‌ను పోలీసులు గంట పాటు ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు పాస్‌పోర్టులు సమర్పించగా, ఇద్దరు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.
పోలీసులకు ఫోన్లు అప్పగించేందుకు నిందితులు నిరాకరించారు. తాము ఫోన్లు వాడడం లేదని బదులిచ్చారు. కోర్టులు ముందస్తు బెయిల్స్ నిరాకరించే వరకూ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితులను పోలీసుల అదే విషయంపై ప్రశ్నించారు. ఐతే తాము ఇళ్ల వద్దే ఉన్నామని, ఎక్కడికి వెళ్లలేదని బదులిచ్చారు. జోగి రమేష్ మాత్రం వరదల వల్లే తాను ఫోన్ స్విచ్ఛాప్ చేశానని చెప్పినట్లు తెలిసింది. తాము అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పలేదని పోలీసులు వెల్లడించారు. గత ఐదు సంవత్సరాలు అవకాశం దొరికినప్పుడల్లా నోరుపారేసుకున్న వైఎస్సార్సీపీ నేతలు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
"వైఎస్సార్సీపీ నేతలు విచారణకు సహకరించలేదు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నారు ఏమీ గుర్తులేదని అంటున్నారు. సెల్‌ఫోన్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. వాళ్లు చెప్పిన జవాబులు సరిచూసుకుని మళ్లీ నోటీసులు ఇస్తాం. ఐదుగురిలో ముగ్గురు మాత్రమే పాస్‌పోర్టులు ఇచ్చారు. తనకు పాస్‌పోర్టు లేదని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు." - మురళీకృష్ణ, మంగళగిరి డీఎస్పీ