Mohan Babu wife about Family Dispute : డిసెంబరు 14న తన పుట్టినరోజు సందర్భంగా తన పెద్ద కుమారుడు విష్ణు ఇంటికి వచ్చాడని, తనతో ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారని మోహన్ బాబు భార్య నిర్మల తెలిపారు. ఈ నెల 15న మంచు విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని మనోజ్ ఆరోపించిన దాంట్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఈ మేరకు పహడీ షరీఫ్ పోలీసులుకు వివరణ ఇచ్చారు. మనోజ్ కంప్లయింట్ చేసిన దానిలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. విష్ణు ఫుటేజ్ బయట పెట్టి గొడవ చేసినట్టు, మనోజ్ లేనిపోని అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని వివరించారు.
విష్ణు తన గదిలో ఉన్న సామాన్లు తీసుకున్నారని, చిన్న కుమారుడు మనోజ్‌కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, పెద్ద కుమారుడు విష్ణుకి కూడా అంతే హక్కు ఉందని మంచు నిర్మల వ్యాఖ్యానించారు. విష్ణు ఎటువంటి దౌర్జన్యం కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదని, గొడవ చేయలేదని తెలిపారు. ఇంట్లో పని చేసేవారు కూడా తామిక్కడ పని చేయలేమని మానేశారని చెప్పారు. ఇందులో విష్ణు ప్రమేయం ఏ మాత్రం లేదని, అంతకు మించి ఇక్కడ జరిగిందేమీ లేదంటూ ఆమె స్పష్టతనిచ్చారు.
మంచు మనోజ్ ఏం ఫిర్యాదు చేశారంటే :తల్లి పుట్టినరోజు సందర్భంగా శనివారం విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్ ఆదివారం ఓ ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. విష్ణు తన ఇంటి వద్ద జనరేటల్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేయించి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపణలు చేశారు. ఆ సమయంలో తాను సినిమా షూటింగ్ ఉన్నానని, కుమారుడి స్కూల్‌లో ఈవెంట్‌కు తన భార్య హాజరైందని తెలిపారు. వాళ్ల అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చేందుకు తన సోదరుడు విష్ణు, అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించారని చెప్పారు. జనరేటర్లలో షుగర్ పోయించారని, దాంతో రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, దాంతో వారంత ఆందోళను గురైనట్లు వివరించారు. అప్పుడు ఇంట్లో అమ్మ, తొమ్మిది నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నట్లు తెలిపారు. జనరేటర్లకు సమీపంలో వాహనాలు పార్క్ చేసి ఉన్నాయని, అక్కడే గ్యాస్ కనెక్షన్ ఉందని వాటివల్ల అగ్ని ప్రమాదం సంభవించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.