Man Sentenced to Ten Years in Prison in Rape Case :10 సంవత్సరాల క్రితం మత్తు మందు ఇచ్చి బాలికపై అత్యాచారం చేసిన ఓ నిందితుడికి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పి.ఆంజనేయులు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. బాలికకు రూ.6 లక్షల పరిహారాన్ని కోర్టు ప్రకటించింది.
పుట్టినరోజని పిలిపించి అత్యాచారం : ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్ రెడ్డి వివరాల మేరకు, హైదరాబాద్లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో నివసించే 10వ తరగతి బాలిక (15) ఇంటికి సమీపంలో ఉన్న ఓ వాటర్ ప్లాంట్‌లో హరియాణాకు చెందిన సోనుశర్మ అలియాస్ మనోజ్ శర్మ (26) పని చేసేవాడు. ఆ బాలికను ప్రతి రోజూ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసేవాడు. 2015 జనవరి 1న తన పుట్టినరోజని నమ్మించి బాలికను తాను పని చేసే ప్రదేశానికి రప్పించాడు. ఓ చాక్లెట్ బాలికకు ఇచ్చాడు. అనంతరం బలవంతంగా అమ్మాయితో తినిపించాడు. కొద్దిసేపటికి బాలిక స్పృహ కోల్పోవడంతో ఆమెపై సోనుశర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు.
కేరళలో కేసు నమోదు : అత్యాచారం విషయం ఎవరికైనా చెప్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని, ఓ లేఖను బాలికకు చూపించి బెదిరింపులకు దిగాడు. 2015 ఫిబ్రవరి 7న బాలికపై సోనుశర్మ మరోసారి అత్యాచారం చేశాడు. మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసింది. అనంతరం బాలిక అదే నెల 20న కేరళ రాష్ట్రంలోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ కడుపు నొప్పి రావడంతో బాలికకు వైద్యులు పరీక్షలు చేశారు. అమ్మాయి 9 వారాల గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే కేరళలోని పఠనంతిట్ట జిల్లాలోని తన్నితోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.