Man Killed for Asking his Money Back in Tirupati:అప్పు చెల్లించమన్నందుకు కత్తితో దాడి చేసి ఒకరిని హత్య చేశారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో జరిగింది. మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రూ.1500 కోసం వాగ్వాదం: ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో మహబూబ్ భాషా టమాటా హోల్ సేల్ దుకాణం నిర్వహిస్తున్నారు. అయితే నిమ్మకాయల వీధికి చెందిన రుద్ర అనే వ్యక్తి మహబూబ్ భాషా అనే వ్యక్తి దగ్గర రెగ్యులర్‌గా కూరగాయలు తీసుకెళ్తుంటాడు. అయితే తన నుంచి తీసుకెళ్లిన టమాటాల బాకీ రూ.1500 చెల్లించాలని రుద్ర అనే వ్యక్తిని మహబూబ్ భాషా కోరారు. బాకీ తీర్చాలని మహమూద్ భాషా అడిగేసరికి పది మందిలో అప్పు అడుగుతావా అంటూ ఆగ్రహానికి గురైన రుద్ర వాగ్వాదానికి దిగాడు. దీంతో రుద్ర మహబూబ్ సాహెబ్‌పై దాడికి పాల్పడగా అతని వద్ద పని చేసే అజంతుల్లా (38) అడ్డుకున్నారు.
స్థానికులు నచ్చజెప్పడంతో అక్కడినుంచి వెళ్లిపోయిన రుద్ర కత్తి తీసుకుని తన అనుచరులతో తిరిగి మార్కెట్‌కు వచ్చాడు. మార్కెట్‌కు వచ్చిన రుద్ర ఆగ్రహంతో వారిపై దాడి చేశాడు. ఈ క్రమంలో మహబూబ్ భాషాతో పాటు దాడిని అడ్డుకున్న కూలి అజంతుల్లా తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా అజంతుల్లా మృతి చెందాడు. గాయపడిన మహమూద్ భాషాను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తిరుపతి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిదితుడు రుద్రని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.