Causes OF Floods In Telangana : విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతాన్ని డ్రోన్ విజ్యూవల్ ద్వారా చూస్తే చెరువు కాదు అంతకుమించి అన్నట్టు వరద చుట్టుముట్టింది. అక్కడక్కడ ఇళ్లు తప్ప పూర్తిగా ఈ ప్రాంతం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఇదే కాదు. ఖమ్మంలోని మున్నేరు వాగు పొంగడంతో దానిని ఆనుకున్న ప్రాంతాలను కూడా వరద ఇలాగే చుట్టుముట్టింది. ఏకంగా ఒకటో అంతస్తు దాటి వరద ప్రవాహం వచ్చింది. దీంతో ప్రజలు తమ సొంత ఇళ్లు, వస్తువులను వదిలి బతుకు జీవుడా అని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలిపోయారు. ఎంతో ఇష్టమైన ఇళ్లు ఇలా వరదల్లో చిక్కుకుపోవడంతో ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు.
మానవ తప్పిదాలతోనే ప్రకృతి విపత్తులు :ఇళ్లు నిర్మించుకోవడం తప్పుమీ కాదు. కానీ, నిర్మించుకోవడానికి ఎంచుకున్న ప్రదేశమే తప్పు. దానికి అనుమతి ఇచ్చిన అధికారులది తప్పు. ఇదే విషయం బుడమేరు వాగు పొంగడంతో చాలా మందికి అర్థమైంది. అయితే, చరిత్రలో కనివిని ఎరుగని ఈ వరదను అధికారులు కూడా ఊహించలేదు. 6వేల క్యూసెక్కుల నీరు ప్రవహించాల్సిన బుడమేరులో ఏకంగా ఒక్క రోజులోనే 40వేల క్యూసెక్కులకు మించి వరద రావడంతో ఆ నీరు ముందుకువెళ్లే మార్గం లేక విజయవాడ పట్టణాన్ని ముంచెత్తింది.
విజయవాడలో ముంపునకు గురైన కాలనీల్లో ఎక్కువ భాగం బుడమేరు కట్ట లోపల నిర్మించిన ప్రాంతాలే. ఇక్కడ కట్టను తొలగించి జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆక్రమణలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. చాలా మంది తక్కువ ధరకు ఇక్కడ స్థలం, ఇళ్లు లాంటివి వస్తుండటంతో ఆశతో కొనుకున్నారు. తీరా నీట మునిగాక తాము కొన్నది ఇలాంటి ప్రదేశంలోనా అని ఆవేదన చెందుతున్నారు.
నష్టపోయింది ప్రజలు - లాభపడ్డది రియల్ వ్యాపారులు :బుడమేరు వాగు వెంట ఉన్న ప్రాంత వాసులకు కూడా తెలియదు. ఇంతలా వరద వస్తుందని. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆక్రమణలు మహా అయితే గత 15ఏళ్ల నుంచి మెుదలై ఉంటాయి. అంటే 2010 తర్వాత ఇక్కడ కాలనీలు రావడం ప్రారంభమయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు, నీటి పారుదుల శాఖ అధికారులకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, కాల్వ పరిధి గురించి తెలిసి కూడా ఇక్కడ భవన నిర్మాణాలు జరుగుతుంటే ఎలా ఊరుకున్నారన్నది ప్రశ్న. కానీ, నష్టపోయింది ప్రజలు. లాభ పడ్డది రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ప్రేక్షక పాత్ర వహించింది అధికారులు. మరి నష్టపోయిన ప్రజలకు దిక్కెవరు?
అందరిదీ ఒకటే వ్యథ :బుడమేరే కాదు తెలంగాణలోని మున్నేరు వాగు పరిస్థితిది కూడా ఇదే వ్యథ. మున్నేరు వాగుకు ఖానాపురం, లకారం వంటి చెరువులతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న కాల్వల పరిధిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు ఉన్నాయి. ఈ పరిధిలో ఎలాంటి భూ అమ్మకాలు, కొనుగోలు జరగకూడదు. ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అధికారులు అనుమతి కూడా ఇవ్వరాదు. కానీ, సాధారణ భూములకు మాదిరే అన్ని రకాల అనుమతులిచ్చారు. అడ్డుకోవాల్సిన అధికారులు భూముల రిజిస్ట్రేషన్ల నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు అన్ని ప్రక్రియలను యథేచ్చగా పూర్తి చేసి ప్రజలను వరదల్లోకి నెట్టేశారు. అంతేగాక కబ్జాలకు తెగబడిన కొంతమంది అక్రమార్కులు నది ప్రవాహానికి అడ్డు నిలిచారు. ఫలితమే ఓ మహా విపత్తు గుప్పిట నిలవడం.