Man Dead Body in Water Tank at Nalgonda :నల్గొండ పట్టణంలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో మృతదేహం కలకలం రేపింది. గత పదిరోజులుగా పలు వార్డుల ప్రజలు అదే నీళ్లను తాగడంతో ఆందోళన నెలకొంది. తాగునీరు తేడాగా ఉండడంతో 11వార్డు ప్రజలు అధికారుల్ని నిలదీయడంతో, పురపాలక సిబ్బంది తనిఖీలు చేయడంతో మృతదేహం లభ్యమైంది.
ఈ మృతదేహం హనుమాన్‌నగర్‌కు చెందిన ఆవుల వంశీ కృష్ణగా గుర్తించారు. అతను గత నెల 24 నుంచి కనిపించడం లేదని, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపాలిటీ సిబ్బందిపై స్థానికులు మండిపడ్డారు. నీళ్లను అందించే విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే నాగార్జున సాగర్‌లోని మంచి నీళ్ల ట్యాంకలో 30 కోతులు పడి చనిపోయిన ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడంతో సంబంధిత అధికారుల తీరుపై పట్టణవాసులు ఫైర్ అవుతున్నారు.
తాగునీరు సరఫరా అవుతున్న 50 ఇళ్లను పరిశీలించాం : ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన స్పందించారు. విచారణ అధికారిగా అదనపు కలెక్టర్ పూర్ణచంద్రను నియమించారు. ఈ ఉదంతంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అంతకముందు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ చందనా దీప్తి మృతికి గల కారణాలపైన ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. కాగా వాటర్ ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా అవుతున్న 50 ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు.