ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారసత్వ సంపదను ఒడిసిపట్టుకున్న యువకుడు - జాతీయస్థాయి సంగీత పోటీల్లో పతకాల పంట - Yasaswi Shows Talent in Fine Arts

Young Boy Shows Talent in Fine Arts: వారసత్వ సంపద అంటే కార్లు, బంగ్లాలు, పొలాలు అనే అపోహలో ఉంటారు చాలామంది. కానీ, తాతా తండ్రులలో ఉన్న కళా వైభవం కూడా ఒక రకమైన సంపద అని గుర్తించాడు ఆ యువకుడు. అటువంటి కళా నైపుణ్యాన్ని తన చేతులారా ఒడిసి పట్టుకున్నాడు. ఇటీవల పంజాబ్​లో జరిగిన జాతీయ సంగీత పోటీల్లో ఏకంగా 3 బహుమతులు సాధించి ప్రముఖులతో ప్రశంసలందుకున్నాడు. మరి, ఎవరా యువకుడు? అతడి కళా నైపుణ్యం ఏంటో ఈ కథనంలో చూద్దాం.

Young_Boy_Shows_Talent_in_Fine_Arts
Young_Boy_Shows_Talent_in_Fine_Arts (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 2:15 PM IST

వారసత్వ సంపదను ఒడిసిపట్టుకున్న యువకుడు- జాతీయ స్థాయి సంగీత పోటీల్లో పతకాలపంట (ETV Bharat)

Young Boy Shows Talent in Fine Arts:బాల్యం నుంచి మన చుట్టూ ఉన్న సానుకూల వాతవరణమే భవిష్యత్తుని నిర్ధేశిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు. కుటుంబంలోని వారంతా కళాకారులు కావడంతో తను కూడా కళా రంగం వైపు అడుగులేశాడు. నాలుగేళ్ల వయసులోనే మృదంగం పట్టి రాను రాను దానిపై మరింత మక్కువను పెంచుకున్నాడు.

ఇటీవల పంజాబ్‌లో జరిగిన జాతీయ సంగీత పోటిల్లో 3 బహుమతులు సాధించి శభాష్‌ అనిపించాడు మల్లాది శివానంద యశస్వి. ఈ యువకుడిది విజయవాడ స్వస్థలం. ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి డా. మల్లాది రవికుమార్‌ సంగీత విద్వాంసుడు, బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్, సంగీత నాటక అకాడమీ అవార్డులను అందుకున్నారు.

తల్లి నిత్య సంగీత సాధన చేస్తుంటారు. ఇంట్లో ఎటు చూసినా సంగీత వాతావరణమే ఉండటంతో చిన్నప్పటి నుంచి శివానంద జీవన విధానంలో సంగీతం భాగమైంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, కళలపై తనకున్న మక్కువ శివానందను జాతీయ స్థాయిలో నిలబెట్టింది. శివానంద మూడేళ్ల వయస్సు నుంచే మృదంగంతో ఆడుకోవటం గుర్తించి మెల్లమెల్లగా మృదంగం, కర్నాటక సంగీతం నేర్పించారు ఈ తల్లిదండ్రులు.

అంతర్జాతీయ జల సదస్సులో 'ఫ్లాష్ మాబ్' - ప్రతినిధుల మెప్పు పొందిన 'ఆంధ్ర' విద్యార్థుల మైమ్

శివానంద తన చదువును కొనసాగిస్తూ లలిత సంగీతం, కర్నాటక సంగీతం, మృదంగంలో సాధన చేస్తున్నాడు. 3విభాగాల్లో డిప్లమా కూడా పూర్తి చేశాడు. సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సంగీత పాటల పోటీల్లో శివానంద మొదటి బహుమతి సాధించాడు. ఆరోజు నుంచి శివానంద ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. పాల్గొన్న ప్రతిసారీ బహుమతులు సాధిస్తూనే వచ్చాడు. ఓ పోటీలో తండ్రి చేతుల మీదుగా వేదికపై బహుమతి అందుకున్నాడు.

జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపిస్తున్నాడు. అయోధ్య రామమందిరం నిర్మాణ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన కచేరీలో పాల్గొన్నాడు. తండ్రి కచేరిలో మృదంగం వాయించి అందరినీ మెప్పించాడు. 2022లో సింగపూర్​లో సిఫా ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మృదంగంతో పాటు తన గానంతో అందరినీ మెప్పించాడు శివానంద. ఇటీవల పంజాబ్​లో జరిగిన నేషనల్ ఇంటర్ యూనివర్శిటీ యూత్ ఫెస్టివల్​లో అద్భుతమైన ప్రతిభ కనపరిచాడు. లలిత సంగీతం, కర్నాటక సంగీత పోటీల్లో మొదటి బహుమతి సాధించాడు. మృదంగంలో సెకండ్ ప్రైజ్ సాధించాడు.

"ఇంట్లో ఎటు చూసినా సంగీత వాతావరణమే ఉండటంతో చిన్నప్పటి నుంచి నా జీవన విధానంలో సంగీతం భాగమైంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, కళలపై మక్కువ నన్ను జాతీయ స్థాయిలో నిలబెట్టింది. అయోధ్య రామమందిరం నిర్మాణ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన కచేరీలోనూ నేను పాల్గొన్నాను. సంగీత రంగంలో ఉన్నతస్థాయికి చేరటమే నా లక్ష్యం." - మల్లాది శివానంద యశస్వి, సంగీత కళాకారుడు

గత రెండేళ్ల నుంచి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని వరుసగా బహుమతులు సాధిస్తూ విజయకేతనాన్ని ఎగురవేస్తున్నాడు శివానంద. తనకు చిన్నప్పటి నుంచి తల్లి గోరుముద్దలతో పాటు సంగీతం కూడా నేర్పించిందని చెబుతున్నాడు. తండ్రి డా.మల్లాది రవికుమార్ ఎప్పటికప్పుడు సంగీతంలో మెళుకువలు నేర్పుతూ ఉండేవారన్నాడు. కుటుంబంతో పాటు పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల యాజమాన్యం సహకరించిందని చెబుతున్నాడు.

జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు. జాతీయ స్థాయి పోటీలకు 150 యూనివర్శిటీల నుంచి 2వేలకు పైగా కళాకారులు వచ్చారు. ముఖ్యంగా కర్నాటక సంగీతంలో కేరళ, కర్నాటక లాంటి రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులతో పోటీ చాలా క్లిష్టంగా ఉంటుందని శివానంద చెబుతున్నారు. నిత్యం సంగీత సాధనలోనే ఉంటారని అటువంటివారితో పోటీపడి బహుమతి సాధించటం చాలా గర్వంగా ఉందని తెలిపాడు. 2023లో విశాఖలో యంగ్ ఆర్టిస్ట్ టాలెంట్ అవార్డ్, నీతా ముఖేష్ అంబానీ కల్చలర్ సెంటర్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాను చాలా చోట్ల కచేరీలు చేస్తున్నా తన కుమారుడు జాతీయ స్థాయిలో రాణించటం చాలా ఆనందంగా ఉందని తండ్రి డా.రవికుమార్ చెబుతున్నారు. సాంప్రదాయంగా వస్తున్న సంగీత కళను శివానంద కొనసాగించటం మాటలతో చెప్పలేని సంతోషంగా ఉందంటున్నారు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే సంగీతం పట్ల ఆశక్తి కనపరిచేవాడని తల్లి నాగలక్ష్మీ చెబుతోంది. సంగీత గొప్పదనాన్ని అందరికీ చాటి చెప్పాలని కోరుతోంది. శివానంద సోదరి కూడా సంగీతంలో రాణిస్తుంది. అన్నతో సమానంగా వయోలిన్​ను అద్భుతంగా ప్లే చేస్తుంది. సంగీత రంగంలో ఉన్నతస్థాయికి చేరటమే తన లక్ష్యమని శివానంద చెబుతున్నాడు.

కళారంగంలో రాణిస్తున్న గోదావరి అమ్మాయి.. ఎన్నెన్నో అవార్డులు

ABOUT THE AUTHOR

...view details