Vizag Railway Zone Updates : దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. విశాఖలో జోనల్ కార్యాలయ నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. జీఎం కార్యాలయం సహా ఇతర పరిపాలన భవనాలు ఇందులో ఉండనున్నాయి. విశాఖ రైల్వే జోన్ భూ కేటాయింపు చేసేందుకు జగన్ సర్కార్ తాత్సారం చేసింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ చినగదిలి మండలం ముడసర్లోవలో 53 ఎకరాలు కేటాయించింది. గత ఆగస్టులో ఆ భూమిని రైల్వేకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. మ్యుటేషన్ ద్వారా రైల్వేశాఖకు భూమి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లోనూ నమోదైంది. దీంతో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో భవనం నిర్మించనున్నారు. డిసెంబర్ 27లోపు టెండర్లు దాఖలు చేయాలని రైల్వేశాఖ తెలిపింది. టెండర్లు దక్కించుకున్న వారు రెండు సంవత్సరాల్లో పూర్తిచేయాలని నిర్దేశించింది. మరోవైపు ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీ అయ్యారు. రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి డిసెంబర్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన జరగనుంది. ఈ మేరకు సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఏపీకి చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలకు తెలియజేశారు.
Notice inviting tender for office construction to set up the South Coast Railway Zone at Visakhapatnam. pic.twitter.com/6O9mQdRdiI
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 24, 2024