SIT Inquiry Adulteration Ghee Case : తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. రెండు రోజుల క్రితం విచారణ ప్రారంభించిన సిట్ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే శనివారం తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. దాదాపు 14 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు ఆహార నమూనాలను, పలు పత్రాలను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్‍డీడీబీ పరీక్ష నివేదికలో బయటపడిన అంశంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి మరో అధికారి ఈ ప్రత్యేక బృందంలో ఉన్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టీ ఉన్నారు. సీబీఐ తరఫున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళి రాంబాతో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (నాణ్యత హామీ) సలహాదారు డాక్టర్ సత్యేన్‌కుమార్ పాండా కూడా సభ్యులుగా ఉన్నారు.
Tirumala Laddu Row Updates : సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ సిట్ పని చేస్తోంది. వీరికోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరకు విభాగాలను పరిశీలించనుంది. లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీవైష్ణవులను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. పూర్తి విచారణ అనంతరం సీబీఐ డైరెక్టర్‌కు సిట్ బృందం నివేదిక ఇవ్వనుంది.