MakloorKasturba Gandhi Girls School Issue: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కొన్ని రోజులుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రత్యేక అధికారిణి, సిబ్బందికి మధ్య వివాదం నెలకొందని తెలిసింది. 15 సంవత్సరాల కిందట నిర్మించిన కేజీబీవీ భవనానికి ప్రహరీ సైతం లేదు. భవనాలు అటవీ ప్రాంతంలో ఉన్నాయి. దీంతో రాత్రివేళల్లో యువకులు వస్తున్నారని విద్యార్థినులు భయపడుతున్నారు. ప్రస్తుతం ఈ కస్తూర్బా విద్యాలయంలో 200 మంది ఇంటర్, 210 మంది పాఠశాల విద్యార్థినులు ఉన్నారు.
ఫిర్యాదుల పెట్టెలో సమస్యలు : రెండు నెలల క్రితం పాఠశాలకు కొత్తగా విధుల్లో చేరిన ప్రత్యేక అధికారిణి అనురాధ ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేసింది. దీంతో కొందరు సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అనురాధకు, కొంతమంది సిబ్బందికి మధ్య విభేదాలు తలెత్తాయి. కొత్తగా వచ్చిన ప్రత్యేక అధికారి అనురాధ తమను ఇబ్బందిపెడుతుందంటూ సిబ్బంది ఇటీవల డీఈవోకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల కిందట జీసీడీవో భాగ్యలత కేజీబీవీకి వచ్చి విచారణ జరిపి నివేదికను డీఈవోకు అందజేశారు.
ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి: కేజీబీవీలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలను విద్యార్థినులు ఎవరితోనూ చెప్పుకోలేక పోయారని, తాను వచ్చాకే ఫిర్యాదు పెట్టెలో గోడు వెళ్లబోసుకుంటున్నారని ప్రత్యేక అధికారిణి అనురాధ చెబుతున్నారు. ఈ విషయాలపైనే సిబ్బందిని ప్రశ్నించానని తెలిపారు. సిబ్బంది ఆగడాలను అరికడుతున్నందుకే తనపై కొంతమంది అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.