Mahatma Gandhi Kalwakurthy Lift Scheme Works : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అసంపూర్తి ప్రాజెక్టుల్లో ఒకటి మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం-కేఎల్ఐ(Kalwakurthy Lift Irrigation). శ్రీశైలం జలాశయం నుంచి 25 టీఎంసీల నీటిని 3 దశల్లో ఎత్తిపోసి, 4 జలాశయాలు నింపి అక్కడి నుంచి కాలవల ద్వారా 3 లక్షల 65 వేల ఎకరాలకు సాగునీరందించడం ఈ పథకం లక్ష్యం. తర్వాత అదనపు ఆయకట్టు జత చేయడంతో ప్రాజెక్టు ఆయకట్టు లక్ష్యం 4 లక్షల 50 వేలకు చేరింది. అయితే పేరుకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకమే అయినా కల్వకుర్తి నియోజకవర్గ రైతులకు మాత్రం ఆ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందడం ప్రహసనంగా మారింది.
కేఎల్ఐ పథకంలోని 29వ ప్యాకేజీ పరిధిలో కల్వకుర్తి నియోజక వర్గానికి సాగునీరు సక్రమంగా అందకపోగా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో తలపెట్టిన డీ-82 పనులు నత్తనడకన సాగుతున్నాయి. మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3వ దశలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా గుడిపల్లిగట్టు జలాశయం నుంచి కల్వకుర్తి నియోజక వర్గంలోని 2 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. గుడిపల్లిగట్టు నుంచి కల్వకుర్తి నియోజక వర్గానికి వెళ్లాల్సిన ప్రధాన కాల్వలు పూర్తి చేసినా చివరి ఆయకట్టు రైతులకు నీరందడం లేదు. కారణం 29వ ప్యాకేజీలోని ప్రధాన కాల్వకు ఎగువ ప్రాంతాల్లోని రైతులు ఎక్కడికక్కడ గండ్లు కొడుతున్నారు.
దీంతో ఏటా వానాకాలం, యాసంగిలో చివరి ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ప్రధాన కాల్వల ద్వారా చెరువులను నింపి అక్కడి నుంచి ఆయకట్టుకు నీరందిస్తున్నారు. పంటకాల్వల నిర్మాణం కూడా పూర్తి కాకపోవడంతో మోటార్ల ద్వారా తోడి పొలాలకు పారించుకుంటున్నారు. దీనికి తోడు ప్రధాన కాల్వను తవ్వి వదిలేశారు. లైనింగ్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. డిస్టిబ్యూటరీల వద్ద షట్టర్లు లేవు. కాల్వ తవ్విన చోట గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రధాన కాల్వ మీద నిర్మించాల్సిన వంతెనలను విస్మరించారు. దీంతో రైతులు, గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
30 నుంచి 50 శాతమే ఈ తరహా పనులు పూర్తయ్యాయి. చాలా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రధాన కాల్వకు రైతులే గండ్లు కొట్టడం లేదా వరదతాకిడికి దెబ్బతినడం వల్ల చాలాచోట్ల నీరు వృథాగా పోతోంది. అలాంటి ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపట్టి చివరి ఆయకట్టుకు నీరందిచాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కరవయ్యాయి. 29వ ప్యాకేజీకి కొనసాగింపుగా, కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ, ఆమన్ గల్, మాడ్గుల చివరి గ్రామాలకు సాగు, తాగు నీరందించేందుకు డీ-82 కాలువ ప్రతిపాదించారు. కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి సమీపంలోని 29వ ప్యాకేజీ నుంచి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల వరకు 66 కిలోమీటర్ల పొడవునా కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
Irrigation Project Works in Palamuru : 2017లో పనులు ప్రారంభించి 2018 డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. 178 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పనులు 80 శాతం పూర్తయ్యాయి. కేవలం 20 శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ, భూసేకరణ పూర్తి కాకపోవడం అడ్డంకిగా మారింది. భూసేకరణపై చారగొండ మండలం తిమ్మాయిపల్లి, వెల్దండ మండలం గుండాల, మాడ్గుల మండలం అప్పారెడ్డి పల్లి, నాగిళ్ల నుంచి హైకోర్టులో రిట్ పిటిషన్లు(Writ Petitions) దాఖలయ్యాయి. దీనివల్ల 150 మీటర్ల మేర కాల్వ తవ్వకాలపై ప్రభావం పడింది. వెల్దండ మండలం చెరుకూరు సమీపంలో సేకరించిన భూముల్లోని టేకుచెట్లకు పరిహారం చెల్లించాల్సి ఉంది. దీంతో అక్కడి కాల్వ నిర్మాణం సైతం ఆగిపోయింది.
మొత్తంగా 29వ ప్యాకేజీలో సుమారు 1673 ఎకరాల భూముల్ని ఇంకా సేకరించాల్సి ఉంది. చాలా చోట్ల రైతులకు ఇవ్వాల్సిన భూసేకరణ పరిహారం సైతం ఇప్పటికీ ఇవ్వలేదు. 29వ ప్యాకేజీలో 454 ఎకరాలకు గాను సుమారు 37 కోట్ల రూపాయల పరిహారం రైతులకు అందలేదు. కాల్వ మధ్యలో వందల మీటర్ల మేర పెద్ద పెద్ద బండరాళ్లు పనులకు అడ్డంకిగా మారాయి. 26 చోట్ల పలు నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడం వల్లే సకాలంలో పూర్తి కాలేదన్న విమర్శలు వస్తున్నాయి. పరిహారం ఇవ్వలేదని కొన్నిచోట్ల తవ్విన కాలువలను రైతులు పూడ్చారు.