Mahabubnagar MP Candidates: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. 3 ప్రధాన పార్టీలు బలంగా ఉన్న తరుణంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు నలుగురు ఆశావహులు ఇప్పటికే అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు.
Telangana Parliament Elections 2024:వీరిలో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పాలమూరు న్యాయ యాత్ర పేరుతో ఇప్పటికే పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు మహబూబ్‌నగర్ కాంగ్రెస్ నాయకులు సంజీవ్ ముదిరాజ్, ఎన్.పి.వెంకటేశ్, ఆదిత్య రెడ్డి, కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అటు నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీలు మల్లు రవి, మందా జగన్నాథం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఆయన సోదరుడు వినోద్ కుమార్ సహా మరికొందరు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మల్లు రవికి ఇప్పటికే దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అవకాశం కల్పించగా, పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి అవసరమైతే ఆ పదవిని వదులుకుంటానని చెబుతున్నారు.
కంచుకోటను మరోసారి కైవసం చేసుకునేందుకు 'హస్తం' పక్కా ప్లాన్ - నిజామాబాద్ బరిలో ఆ అభ్యర్థి!
Mahabubnagar BJP MP Candidates :ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నాగర్‌కర్నూల్ నుంచి బీజేపీ టికెట్‌ను ఆ పార్టీ నాయకురాలు బంగారు శృతి ఆశిస్తుండగా, ఇక్కడి నుంచి పార్టీలో పెద్దగా పోటీలేదు. కానీ మహబూబ్‌నగర్ స్థానానికి మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి బరిలోకి దిగేందుకు హేమాహేమీలు పోటీపడుతున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి బండారు శాంతికుమార్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణ ఈసారి కచ్చితంగా గెలుస్తానంటూ, మరోసారి బరిలో దిగాలని భావిస్తున్నారు.
మరోవైపు బీసీ కేటగిరికి చెందిన నేత, పార్టీ నాయకత్వం సూచనతో గతంలో 2 సార్లు ఎంపీ టికెట్ వదులుకున్న బండారు శాంతికుమార్ తగ్గేదేలే అంటున్నారు. ఈ సారి మాత్రం అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటున్న ఆయన, టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత జితేందర్ రెడ్డి సైతం పాలమూరు తన అడ్డా అంటున్నారు. టిక్కెట్టు తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారు.