Mahabubnagar MLC Vote Counting 2024: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉపఎన్నిక జరిగింది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో నిలిచారు.
Mahabubnagar MLC Results Today :ఈ ఉపఎన్నికలో పోటీకి బీజేపీ దూరంగా ఉంది. నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లుండగా 1,437 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలోని ఇద్దరు ఎంపీటీసీలు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెట్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కౌంటింగ్‌ను ఈసీ ఇవాళ్టికి వాయిదా వేసింది.
ఉపఎన్నిక లెక్కింపు :కౌంటింగ్ కోసం 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ముందుగా 10 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్లను రెండు రౌండ్లలో లెక్కిస్తారు. ఆ తర్వాత చెల్లుబాటు కాని ఓట్లను వేరుచేస్తారు. చెల్లుబాటయ్యే ఓట్ల ఆధారంగా కోటా నిర్ణయిస్తారు. అనంతరం మొదేటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఏ అభ్యర్ధికైనా మొదటి ప్రాధాన్యత ఓటులో కోటా కన్నా ఒక్క ఓటు అధికంగా వచ్చినా వారినే విజేతగా నిర్ణయిస్తారు. ఏ అభ్యర్థికీ కోటాకు కావలసిన ఓట్లు రానట్లయితే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి తదుపరి ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఏ అభ్యర్థికీ కోటా రానట్లయితే చివరికి మిగిలిన అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు.