Mahabubnagar MLC By Election 2024 :మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసన మండలి నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపెవరిది ? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రాజకీయ పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశమిది. గత ఎన్నికలో మెజారిటీ ఓటర్లు ఉండటంతో పోటీ లేక ఏకగ్రీవమైన ఆ స్థానం ఎమ్మెల్యేగా గెలిచిన కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్అభ్యర్ధులు తీవ్రంగా పోటీ పడుతున్నారు.
అత్యధిక ఓటర్లు బీఆర్ఎస్కు చెందిన ప్రజా ప్రతినిధులే ఉన్నా ఇటీవల కాంగ్రెస్‌లోకి వలసలు పెరగడంతో పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్యేతర ప్రజా ప్రతినిధులు, స్వతంత్రుల ఓట్లు అభ్యర్ధులకు కీలకం కానున్నాయి. ఎక్కువ మందిని ఎవరు ప్రసన్నం చేసుకుంటే వారికే విజయం దక్కనుంది. ఈ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్ధి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్ధి సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు.
మహబూబ్‌నగర్‌లో ఎన్నికల హీట్ - ఎమ్మెల్సీ పదవిపై ప్రధానపార్టీల ఫోకస్
MLC By Poll In Mahabubnagar :ఇద్దరు ఎంపీలు, 14 మంది శాసన సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు కలిపి పూర్వ జిల్లాలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా వీరిలో 644 మంది పురుషులు, 795 మంది మహిళలున్నారు. వీరంతా ఈ నెల 28న జరిగే పోలింగ్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశం ఉత్కంఠను రేపుతోంది.
2021లో జరిగిన ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్ధులెవరూ పోటీ చేయకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్ధులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందే కొంత మంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరి పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. గద్వాల జిల్లా పరిషత్ ఛైర్మన్ సరిత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి గద్వాల ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఎమ్మెల్సీ పోరులో గెలుపు ఎవరిది? :నారాయణపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పలు మండలాల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా మహబూబ్‌నగర్ జడ్పీ ఛైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. మహబూబ్‌నగర్ పురపాలికలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరి ఏకంగా ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
గద్వాల మున్సిపల్ ఛైర్మన్ సహా 16 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ను వీడి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అలా వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు హస్తం పార్టీలో చేరడంతో కాంగ్రెస్ బలం క్రమంగా పెరుగుతోంది. ఎంత మంది పార్టీని వీడినా బీఆర్ఎస్ మాత్రం గెలుపు ధీమాతో ఉంది. వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ చెందిన వాళ్లే ఉన్నారు. వారిలో కొంత మంది పార్టీని వీడినంత మాత్రాన గెలుపు పై ప్రభావం చూపదని భావిస్తున్నారు. ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్, కాంగ్రెసేతర ప్రజాప్రతినిధులపైనా అభ్యర్ధి ఆశలు పెట్టుకున్నారు.
TRS Won Mahabubnagar MLC Seats: తెరాస ఖాతాలో మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి - బీ ఫామ్ అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి