Hyderabad Pub Djs Drugs Case Update : హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్‌లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు సోదాలు నిర్వహించి 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
మణికొండ కేవ్ పబ్‌లో పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే డీజే నిర్వాహకుడు ఆయూబ్‌తో పాటు మరో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్టు ప్రాథమిక పరీక్షలో తేలిందన్నారు. మత్తుపదార్ధాలు సేకరించిన వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారని ఆయన వివరించారు.
వివరాల్లోకి వెళ్తే :రాయదుర్గం పోలీస్‌స్టేషన్ సమీపంలో ఖాజాగూడలో ది కేవ్ పబ్బును నగరానికి చెందిన రాజేశ్, అభినవ్, సాయికృష్ణ, సన్నీ తదితరులు గత కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ పబ్బుకు మేనేజర్లుగా నాగారంలోని శిల్పానగర్‌కు చెందిన ఆర్ శేఖర్‌కుమార్ వ్యవహరిస్తున్నాడు. రాజేశ్, అభినవ్, సాయికృష్ణ, సన్నీ, శేఖర్‌కుమార్ డ్రగ్స్ తీసుకునే ప్రోత్సహిస్తే ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడ్డారని పోలీసులు గుర్తించారు.
Drug Case Busted at Manikonda Cave Pub :సైకిడెలిక్ పార్టీ పేరుతో పబ్బులో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరి ప్రవేశానికి రూ.3 వేల చొప్పున ధర నిర్ణయించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫారెస్ట్ ఆల్కెమీ తదితర కోడ్‌భాషలో పార్టీ ఉన్నట్లు ప్రచారం చేశారు. ఎవరికివారు ముందస్తుగా డ్రగ్స్ సేవించి పబ్బుకు రావాలని కోరారు. ఇలా వచ్చిన వారికి ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ సంగీతం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సాధారణ వ్యక్తులు భరించలేనంత డ్రగ్స్ తీసుకుంటేనే, ఆస్వాదించేలా శబ్ధాలుండేలా ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేల్చారు.
ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ సంగీతం కోసం నిర్వాహకులు నగరంలోని న్యూమల్లేపల్లికి చెందిన బెంగళూరులో ఉండే డీజే అబ్దుల్లా ఆయుబ్, దమ్మాయిగూడకు చెందిన డీజే ఎ.సాయిగౌరంగ్లను రప్పించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశానికి స్పందించి మొత్తం 55 మంది హాజరయ్యారని పోలీసులు గుర్తించారు. పబ్బులో డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందుకున్న టీజీ న్యాబ్, మాదాపూర్ ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా అర్థరాత్రి ఆకస్మికంగా తనీఖీలు చేశారు.
ఇలాంటి పార్టీలు నిర్వహిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం :పబ్బుకు వచ్చిన 55 మందిని అదుపులోకి తీసుకుని తెలంగాణ నార్యోటిక్ పోలీసులు ప్రత్యేక కిట్లతో డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, అందులో డీజేలు అబ్దుల్లా ఆయుబ్, సాయి గౌరంగ్‌తో పాటు 24 మందికి పాజిటివ్‌గా తేలింది. ది కేవ్ పబ్బు మేనేజర్ ఆర్.శేఖర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో టీసీఎస్, అమెజాన్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఉన్నారని పోలీసులు తేల్చారు.
పబ్బు నిర్వాహకులు గతంలోనూ ఇలాంటి పార్టీలు నిర్వహించిన్నట్లు అనుమానం వ్యక్తపరిచారు. ప్రస్తుతం పబ్బు యాజమానులు రాజేశ్, అభినవ్, సాయిక్రిష్ణ, సన్నీపరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. డ్రగ్స్ తీసుకున్న వారిని ప్రోత్సహించేందుకు నిర్వాహకులు పార్టీ ఏర్పాటు చేశారని, పబ్బు లైసెన్సు రద్దు చేస్తామని డీసీపీ వినీత్ తెలిపారు. తర్వలో అన్ని పబ్బుల్లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు.
మత్తు మాయలో విద్యార్థులు - కాలేజీల్లోనే డ్రగ్స్ వినియోగం - రంగంలోకి టీజీ న్యాబ్ - DRUG USE IN COLLEGES IN HYDERABAD
'ఇకపై అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ కీలక సూచన - Anti Drugs and Cyber Safety