Low Pressure Area Continuous Over West Central Bay Of Bengal :బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు 1.5 కిలోమీటరు ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఇవి గంటకు 65 కి.మీ వేగంతో ఉంటాయని విశాఖ వాతావరణశాఖ అధికారి సుధావల్లి అన్నారు.
రాగల 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రెండు రోజుల పాటు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాయలసీమలోనూ కొన్నిచోట్ల ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
కొనసాగుతున్న హెచ్చరికలు : రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. శనివారం తర్వాత రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. చలిగాలులు వీచాయి. బుధవారం రోజూ పలు జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. అల్పపీడనం తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో తీరప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల మేర తగ్గాయి.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన