Lovers Suicide in Car at Medchal : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రేమజంట ఆత్మహత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుల్లో ఒకరైన 17 ఏళ్ల బాలిక తన తండ్రి శ్రీరాములుకు ఫోన్ నుంచి వాట్సాప్‌లో లొకేషన్, మూడు పేజీల లేఖను పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఇవి చూసి భయపడ్డ బాలిక తండ్రి లొకేషన్ చూపించిన ప్రాంతానికి వెళ్లేలోపే ఇద్దరూ మంటల్లో కాలిపోయారు. బాలిక ప్రేమ వ్యవహారం తెలిసి బ్లాక్‌మెయిల్ చేసిన చింటూ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ప్రేమ విషయంపై బెదిరింపులు :యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమిలాపేట్‌కు చెందిన శ్రీరాములు ఘట్‌కేసర్ మండలానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఇద్దరూ సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతురాలి సమీప బంధువు వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెబుతానని తరచూ బ్లాక్ మెయిల్ చేయడం వల్లే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. అసలు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందని పోలీసులు దర్యాప్తు చేయగా ఎక్కడెక్కడికెళ్లారో బయటపడింది.
పెట్రోల్ బంక్‌కు కారులో : సోమవారం ఉదయం బాలిక తండ్రి ఆమెను ఇంటర్ కళాశాల దగ్గర ఉదయం 8 గంటల ప్రాంతంలో దింపాడు. కొద్దిసేపటి తర్వాత శ్రీరాములు కారులో వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో కారులోనే సంచరించినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడలోని ఓ దుకాణంలో 20 లీటర్ల నీళ్ల డబ్బా కొనగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి సమీపంలోని పెట్రోల్ బంక్‌కు కారులో వెళ్లిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
వాట్సాప్‌లో ఆత్మహత్య లేఖ :దాదాపు 10-15 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బంకు సిబ్బంది మాత్రం పెట్రోలు అమ్మలేదని పోలీసులకు చెబుతున్నారు.పెట్రోలు సీసాల్లో అమ్మినట్లు తెలిస్తే తమపైనా కేసు నమోదవుతుందనే ఉద్దేశంతో నిజం చెప్పడం లేదని తెలుస్తోంది. డబ్బాలో పెట్రోలు కొనుగోలు చేసిన ఇద్దరూ అక్కడి నుంచి నేరుగా కొంత నిర్మానుష్యంగా ఉండే ఘన్‌పూర్ సర్వీసు రోడ్డులోకి వెళ్లారు. శ్రీరాములు, బాలిక ఇద్దరూ తల్లిదండ్రులకు ఆత్మహత్య లేఖను వాట్సాప్‌లో పంపించి ఆత్మాహుతికి పాల్పడ్డారు.