Samsthan Narayanpur Lorry Families Story :ఏ ఊళ్లోనైనా సరే మా ఊళ్లో ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నారు. లేకపోతే మా ఊరి నిండా ప్రతి ఇంటిలోనూ పోలీస్ లేక రక్షణ దళంలో పని చేసే వ్యక్తి ఉంటారు అని చెప్పుకుంటే వింటుంటాం. కానీ ఆ ఊళ్లో మాత్రం ఎవరిని కదిపినా ఒకే మాట మా నాన్న డ్రైవర్, మాకు లారీలు ఉన్నాయి. మా అన్నయ్య డ్రైవర్, మా తమ్ముడు డ్రైవర్ వారికి లారీలు ఉన్నాయని చెబుతారు. ఏంటి ఆశ్చర్యం వేస్తోంది కదూ. ఒకే ఊళ్లో ఇంతమంది లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లుగా ఉండటం ఏంటని? ఇక్కడ వందకు పైనే కుటుంబాలు లారీ పరిశ్రమనే నమ్ముకొని జీవిస్తున్నాయంటే నమ్మగలరా? ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉందంటే? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది.
అసలు కథేంటంటే : యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవి చెర్వు గ్రామంలో 130 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల్లోని సుమారు 100కు పైగా కుటుంబాలు గత 45 ఏళ్లుగా లారీ పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇలా గ్రామంలో ప్రతి ఇంట్లోనూ లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లుగా పని చేస్తున్నవారు ఉన్నారు. కరోనా కంటే ముందు ఊరిలో 150 కంటే ఎక్కువ లారీలే ఉండేవి.
ఈ ఊరిలో కొన్ని కుటుంబాల్లో ఒక్కరికి నాలుగు వరకు లారీలు ఉండటం ఒక విశేషం. అది కూడా మొదట క్లీనర్‌గా పని చేసిన వారు డ్రైవర్లుగా మారడం, ఆ తర్వాత లారీ యజమానులుగా మారి లారీ ఓనర్ కమ్ డ్రైవర్‌గా మారుతున్నారు. అలా రానురానూ లారీలకు యజమానులుగా మారి ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు లారీలతో వ్యాపారం చేస్తున్నారు. మరికొంత మంది డ్రైవింగ్ ఫీల్డ్‌కు సంబంధం లేకున్నా, లారీ యజమానులుగా మారి ఉపాధి పొందుతున్నారు.