Lorry Driver YouTube Earnings 10 Lakhs per Month :ప్రస్తుత కాలంలోసామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయాయి. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి వాటిల్లో గంటల కొద్దీ సమయం గడిపే వారు ఎందరో ఉన్నారు. అయితే వాటితోనే కొందరు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. తాము చేసే పనినే వీడియోలు తీస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో పాటు ఆదాయమూ పొందుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ రాజేశ్ రవానీ కూడా ఈ కోవకు చెందినవాడే. వృత్తి రీత్యా లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న ఈ ఝార్ఖండ్ డైనమైట్, ఇందుకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలతోనే నెలకు రూ.అక్షరాలా రూ.10 లక్షలు సంపాదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే,
మొదట్లో రాజేశ్ రవానీ కూడా అందరి లాంటివాడే. లారీని నడుపుతూ గతుకుల రోడ్లపై ముక్కుతూ మూల్గుతూ ప్రయాణించడం, హైవేలపై దూసుకెళ్లడం, సరకు రవాణా చేయడం, దించడం, ఎత్తడం వంటి పనులు చేస్తుండే వాడు. అదృష్టం అనేది ఎలా దరికి వస్తుందో చెప్పలేం. ఈ రాజేశ్ రవానీకి మాత్రం రోడ్డు పక్కన బండి ఆగిపోయి తరించింది అదృష్టం. అప్పుడే అక్కడ బండి నిలిపి వేసి, స్టౌ ఆన్ చేసి చికెన్ కూరను వండాడు. కష్టాల్లోనూ కమ్మని భోజనం ఆరగిస్తున్నానంటూ ఆ సంగతులను చెప్పి, వాటిని ఫోన్లో రికార్డు చేశాడు.
ఈ మాటలు విన్న రాజేశ్ కుమారుడు నాన్న మాటలో ఏదో మ్యాజిక్ ఉందని పసిగట్టాడు. ఆ వీడియోను వెంటనే యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. వీడియోను చూసిన జనం తెగ ఫిదా అయిపోయారు. దాంతో లారీ క్యాబిన్నే కిచెన్‌గా మార్చేసి, నోరూరించే వంటలు చేస్తూ మాటల మసాలాను దట్టించేవాడు. ఇలా చేపల పులుసు, రాఖీ పండగ పాయసం, గరమ్ గరమ్ పకోడా వంటి వంటలను వండేవాడు. వాటిని వీడియోలు తీసి, ఘుమఘుమలాడించే వాడు. వంట వండటమే కాకుండా, ట్రక్ వెళ్లిన చోట వింతలు, విశేషాలు, రోడ్డు ప్రక్కన ప్రమాదాలు వంటివి చూపించడం చేశాడు. అలాగే అభిమానులతో మీటప్లు కూడా చేసేవాడు.