Liquor Shops Applications Deadline Over in AP :రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చి ఉంటాయని, రూ.1800 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. వత్సవాయి దుకాణానికి అత్యధికంగా 132 దరఖాస్తులు వచ్చాయి.
మొత్తం దరఖాస్తులు 90 వేలపైనే : రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల సమర‌్పణకు శుక్రవారంతో గడువు ముగిసింది. శుక్రవారం సాయంత్రం ఏడింటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా, ఆ సమయానికి 87,986 దరఖాస్తుల అందగా రాత్రి 11 గంటలకు ఆ సంఖ్య 89,643కు పెరిగింది. గడువు ముగిసే సమయానికి చాలా చోట్ల దరఖాస్తుదారులు లైన్లలో వేచి ఉండడం, కొందరు వ్యాపారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో మొత్తం దరఖాస్తులు 90 వేల దాటొచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.1800 కోట్లపైనే ఖజానాకు ఆదాయం సమకూరనుంది.
మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు - రూ. 1800 కోట్లకు పైగా ఆదాయం
ఏపీలో నూతన మద్యం పాలసీ : రాష్ట్రంలో 2017 మార్చిలో చివరిసారిగా ప్రైవేటు మద్యం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అప్పట్లో 4,380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 76 వేల దరఖాస్తులు వచ్చాయి. అంటే సగటున ఒక్కో దుకాణానికి 17 నుంచి 18 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తులతోపాటు రిజిస్ట్రేషన్ రుసుముల రూపంలో అప్పట్లో ఎక్సైజ్ శాఖకు 474 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సారి 3,396 దుకాణాలకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే 2017 కన్నా తక్కువ దుకాణాలకే నోటిఫికేషన్ ఇచ్చినా దరఖాస్తులు మాత్రం ఎక్కువ వచ్చాయి. ఆఖరి రోజునే 24,014 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.