Water Crisis in India : దేశానికి రాజధాని. యావత్ భారతదేశ పాలనకు ముఖ్య కేంద్రం. అయినా ఏం లాభం. కనీస అవసరమైన నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి. గత 15రోజులుగా ఇదే పరిస్థితి. దిల్లీకి మంచినీరు అందించే నీటి వనరుల్లో నిల్వలు తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు దిల్లీ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు తగ్గకపోవడం సమస్యను మరింత పెంచింది. వేసవి ముగిసి 15రోజులు కావస్తున్నా దిల్లీలో 45నుంచి 47డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
విద్యార్థులు భద్రమేనా- స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై స్పెషల్ స్టోరీ - school bus fitness
దీంతో వర్షాలు లేక, నల్లానీరు రాక ప్రజలు చుక్కనీటి కోసం సతమతం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా అవి అరకొరగానే ఉంటున్నాయి. వీధిలోకి నీటి ట్యాంకర్ వస్తే దాని చుట్టూ ఎగబడి నీటిని తీసుకుంటున్న దృశ్యాలు దిల్లీలో అనేకం. ఒక్క బకెట్ నీరు దొరికినా చాలు అన్నట్లు ప్రజలు ట్యాంకర్ల చుట్టూ చేరడం అక్కడి దీనస్థితికి అద్దం పడుతోంది.
సుప్రీంకోర్టు ఆగ్రహాం.. దిల్లీకి నీటిని ప్రధానంగా యమునా నది నుంచి తీసుకుని, శుద్ధి చేసిన తర్వాత సరఫరా చేస్తారు. అయితే యమునలో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. మ్యూనక్ కాలువ కూడా దిల్లీ నీటి అవసరాలను తీరుస్తోంది. వేసవి కావడంతో ఈ కాలువలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఉన్న కొద్దిపాటి నీటిని కూడా ట్యాంకర్ మాఫియా అక్రమంగా తీసుకుంటోంది. ట్యాంకర్ మాఫియా ఆగడాలపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మాఫియా నీటిని మింగేస్తోందని, దీన్ని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారని దిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
బెంగళూరు, దిల్లీ లాంటి ప్రాంతాల్లో నీటి కొరతకు అనేక కారణాలు ఉన్నాయి. నీటికి ప్రధాన ఆధారమైన వర్షాలు కురవకపోవడం అందులో మొదటి కారణం. ఈ కారణంగా జలాశయాల్లో నీరు అడుగంటి ప్రజలకు తగినంత సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి మనుషులు చేసే లెక్కకు మిక్కిలి తప్పులు కూడా దీనికి తోడవుతున్నాయి. అడ్డూఅదుపూ లేకుండా భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడడంతో అవి అడుగంటాయి. ఎన్ని వేల అడుగులు తవ్వినా చుక్కనీరు రాని పరిస్థితి ఏర్పడింది.
కొరవడిన అవగాహన.. పట్టణీకరణ, జనాభా పెరుగుదల మరో కారణం. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున నగరాలు, పట్టణాలకు వస్తూ ఉండడంతో వారి అవసరాలకు నీరు సరిపోక కొరత ఏర్పడుతోంది. పట్టణాల్లో నిర్మాణాల కోసం చెరువులు, కుంటలు వంటి నీటి వనరులను పూడ్చడంతో వాటి జాడ లేకుండా పోతోంది. ఉన్న కొద్ది పాటి జల వనరులు సైతం కలుషితంగా మారడంతో నగరాలు, పట్టణాల్లో నీటికి కొరత ఏర్పడుతోంది. నీటిని వృధా చేయడం, వర్షపు నీటిని పొదుపు చేయాలన్న విషయాలపై అవగాహన లేకపోవడం వల్ల కొరత ఏర్పడినపుడు అవసరాలు తీరే మార్గం కనిపించడం లేదు.