Leopards roaming in Telangana : వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అడవులను నరికి, కొండలను కూల్చేస్తుండటంతో ఆవాసాలు లేక అడవి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ప్రజలు, పశువులపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో చిరుత, పెద్దపులి, ఎలుగుబంటి సంచారం, దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలే నిర్మల్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలకు ఈ పులుల సంచారం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కొండపై రెండు పులులు సంచారం : నిర్మల్ జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపింది. పట్టణంలోని విశ్వనాత్ పేట్ శివారులో ఉన్న కొండపై గత కొద్ది రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఉదయం గుట్టపై కూర్చొని చిరత, చిరుత పిల్ల కనిపించినట్లు అక్కడున్న ఓ పశువుల కాపరి తెలిపారు. గతంలో కూడా అదే ప్రాంతంలో చిరుత సంచరించిందని ఇది రెండవ సారి చూసినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం రావడంతో అక్కడికి చేరుకొని స్థానికుల ద్వారా వివరాలు సేకరించారు. అటువైపు ఒంటరిగా వెళ్లొద్దని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు.