Left Parties Conference Against Central Policies : దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, నియంతృత్వ విధానాలతో ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను (Governor System) తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని వామపక్ష పార్టీలు విమర్శించాయి. ప్రధాని మోదీ ఒక నియంతలా, కాల నాగులా అందర్నీ కాటేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
ఈ మేరకు 11 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) వామపక్షాల మాదిరిగా బీజేపీపై పూర్తిస్థాయి పోరాటాలను చేయడం లేదని ఆయన విచారణ వ్యక్తం చేశారు. సమస్యలపై గతంలో మాదిరిగా పోరాటాన్ని ఉద్ధృతం చేసి, సమాజాన్ని చైతన్య పరచాలన్నారు. కాషాయ పార్టీ ప్రతి ఎన్నికల ముందు ఏదో కారణంతో ప్రజల ముందుకు వస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
MLA Kunamneni Fires on BJP :గతంలో ట్రిపుల్ తలాక్, సీఏఏ అమలు చేయడానికి నోటిఫికేషన్ విడుదల, అయోధ్యలోని శ్రీ రాముని ఆలయ నిర్మాణం తదితర అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మోదీ కాలనాగులా వ్యవహరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా లొంగదీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిమందికే చట్టాలు అమలు అయ్యే కుట్రలు పన్నుతున్నారని ఆయన తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి 15 వరకు సీఏఏ, ఎన్ఆర్సీ అంశాలతో పాటు బీజేపీ వైఖరిపై అన్ని జిల్లాల్లో, మండలాల్లో సదస్సులు నిర్వహించాలని 11 పార్టీలు తీర్మానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.