Leap Year Birthday Celebrations 2024 : సాధారణంగా చిన్నారులకు ఏటా పుట్టినరోజును తల్లిదండ్రులు వేడుకగా నిర్వహిస్తారు. వివాహ వార్షికోత్సవాలను పెద్దలు సైతం జరుపుకొంటారు. అయితే వారికి ఇలాంటి వేడుకలన్నీ నాలుగేళ్లకు ఓసారి మాత్రమే వస్తుంటాయి. పుట్టినరోజు, పెళ్లిరోజు తదితర వేడుకల కోసం అంతవరకు నిరీక్షించాల్సిందే. లీపు సంవత్సరంలో జన్మించిన, వివాహం చేసుకున్న వారికి ఫిబ్రవరి 29 చాలా ప్రత్యేకం. ఈ సంవత్సరం లీపు సంవత్సరం కావడంతో వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు నిజామాబాద్ జిల్లాలోని పలువురు.
సాధారణంగా పుట్టినరోజు అనగానే అందరికీ ఏటా జన్మించిన రోజు గుర్తుకొస్తుంది. అంతేకాదు ప్రతి ఏడు ఆ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే లీపు సంవత్సరం నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఆ రోజున జన్మించిన వారు పుట్టినరోజునూ నాలుగేళ్లకోసారి జరుపుకోవాల్సి వస్తుంది. అంటే అంతా ప్రతి ఏడాది పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంటే, వీళ్లు మాత్రం నాలుగేళ్లకోసారి వచ్చే ఫిబ్రవరి నెల 29నే వేడుకలు చేసుకునే అవకాశం ఉండడంతో వాటిని మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు.
"నాలుగేళ్లకోసారి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జన్మించడం ప్రత్యేకంగా భావిస్తున్నాను. ఏటా ఫిబ్రవరి 29 రాదు కాబట్టి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే తేదీన పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకుంటాం. నాతో పాటు ఈరోజు పుట్టిన రోజు జరుపుకునేవాళ్లందరికీ జన్మదిన శుభాకాంక్షలు". - బర్త్డే బాయ్
లీప్ ఇయర్ అంటే ఏమిటి? నాలుగేళ్లకోసారి ఎందుకొస్తుంది? ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం!