Leaders Angry with killing of TDP Worker in Anantapur District : అనంతపురం జిల్లాలో తెలుగుదేశం కార్యకర్త ఆదెప్ప దారుణ హత్యను పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఛీ కొట్టినా వైఎస్సార్సీపీ మాత్రం హత్యా రాజకీయాలను వీడటం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం కార్యకర్త ఆదెప్పను వైఎస్సార్సీపీ గూండాలు పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా హత్య చేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ గూండాలు 9 మంది కార్యకర్తలని పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదెప్ప కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
అనంతలో వైఎస్సార్సీపీ నాయకుల దుశ్చర్య - టీడీపీ కార్యకర్త దారుణ హత్య - tdp leader murder in anantapur
అధికారం కోల్పోయిన వైఎస్సార్సీపీ నాయకులు పల్లెల్లో ఆధిపత్యం నిలుపుకోవడం కోసం హత్యా రాజకీయాలు చేస్తున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. మెచ్చిరి గ్రామంలో తెలుగుదేశం నేత ఆదెప్పను హతమార్చడం హేయమైన చర్యని తెలిపారు. కిరాతకంగా ఆదెప్పను మట్టు బెట్టి వైఎస్సార్సీపీ నాయకులు సాధించింది ఏంటని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలను ఒక తాటిపై తీసుకొచ్చి, పార్టీకోసం అహర్నిశలు పని చేసిన వ్యక్తి ఆదెప్ప అని కాలవ కొనియాడారు. ఆదెప్పను హతమార్చిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హంతకులను పట్టుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారన్నారు. హత్యా రాజకీయాలను నమ్ముకున్న వైసీపీ పార్టీ ప్రజల్లో కనుమరుగు కావడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ తరుఫున ఆదెప్ప కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని కాలవ శ్రీనివాసులు తెలిపారు.