Landslides In Alluri Sitaramaraju District :ఎడతెరపి లేని అత్యంత భారీ వర్షం, ఉరుములు, మెరుపుల ధాటికి అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతమైన మాదిగముల్లులోని ఓ కుటుంబం నిద్ర నుంచి మేల్కొంది. ఇంట్లోకి వరద నీరు చేరడంతో సమీపంలోని మరో ఇంటికి వెళ్లి మొదటి అంతస్తు ఎక్కారు. అంతెత్తులోనూ పీకల్లోతు నీటిలో మునుగుతూ ప్రాణాలు అరచేత పెట్టుకుని గడిపారు. తెల్లారాక దిగొచ్చి చూస్తే అక్కడ తమ ఇంటి ఆనవాళ్లే కన్పించలేదు. చుట్టూ బురద, చెట్లు మేట వేశాయి.
Flash Floods In AP : అదే జిల్లా కమ్మరితోటలో అత్యంత భారీ వర్షం, పెద్ద పెద్ద శబ్దాలతో గ్రామ ప్రజలంతా రాత్రంతా భయం భయంగా జీవించారు. తెల్లారాక చూస్తే కొండ చరియలు విరిగిపడి, కొట్టుకు వచ్చిన మట్టి ఊరిని చుట్టేసింది. పొలాలు రాళ్లతో మేట వేశాయి. మరికొంతసేపు వాన కురిస్తే ఊరే తుడిచిపెట్టుకుపోయేదేమో అనే పరిస్థితి నెలకొంది. అక్కడే కాదు సీలేరు, గుమ్మిరేవుల, ధారకొండ, దుప్పలవాడ, గాలికొండ, అమ్మవారి ధారకొండ ప్రాంతాల్లోనూ ఇదే విధంగా వరద ముంచెత్తింది. వంతెనలు కొట్టుకుపోయాయి. సీలేరుకు ఇప్పటికీ బస్సులు రావడం లేదు.
ఆగస్టు నెలాఖరులో కురిసిన వర్షానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురంలో కొండ చరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. విశాఖపట్నంలోనూ భారీ వర్షాలకు కొండ ప్రాంతంలోని ఇళ్ల కింద మట్టి కొట్టుకుపోవడంతో ఏ క్షణమైనా కూలిపోయేలా ఉన్నాయి.
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం- అక్టోబర్, డిసెంబర్లో కూడా వర్షాలు పడతాయ్! : IMD
ఇంకా కళ్లు తెరవని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ : ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతంలో వచ్చిన వరదలు కేరళలోని వయనాడ్ విలయాన్ని గుర్తు చేసేలా ఉన్నాయి. ఆ వరదలకు మన్యం ఇంకా కోలుకోలేదు. వాతావరణ మార్పులతో ఊహించని విధంగా విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా అత్యంత భారీ వర్షాలు (24 గంటల్లో 20.4 సెం.మీ. మించి) కురుస్తున్నాయి. ఆగస్టు చివరిలో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 24 గంటల్లో 53 సెం.మీ వర్షం కురవడం భవిష్యత్తులో వచ్చే విలయం మరెంత భయానకంగా ఉంటుందో హెచ్చరిస్తోంది. రికార్డులు తిరగరాస్తున్న వరద ప్రవాహాల ధాటికి ప్రాజెక్టు నిర్మాణాలనే పునస్సమీక్షించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ముంచెత్తుతున్న వరదలకు రోడ్లు, ఇళ్లు, పొలాలు అని తేడా లేకుండా అన్నీ ఏకమై రోజుల తరబడి బురద, ముంపులో మునుగుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో ఎవర్ని కదిలించినా ఇంతటి వరద 40, 50 సంవత్సరాల్లో ఎన్నడూ చూడలేదనే మాటలే.
వయనాడ్ తరహా విలయం విరుచుకుపడినా ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన అత్యంత భారీ వర్షాలను తలదన్నేలా కుంభవృష్టి ముంచెత్తినా నిండా మునగడమే. ఈ సంవత్సరం భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించిన సమావేశాల్లోనే కేంద్ర విపత్తుల శాఖ హెచ్చరించింది. అప్పుడే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమై ప్రణాళికలు రూపొందించి ఉంటే ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ తరహా విపత్తు ఎదురయ్యేది కాదు. అయినా ఆ శాఖ ఇప్పటికీ కళ్లు తెరవలేదు. అటవీ ప్రాంతాల్లో పెరుగుతున్న విపత్తులు, కొండ ప్రాంతాల్లోని ఇళ్లకు పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలపై చేష్టలుడిగి చూస్తోంది.
ఒక్క రోజులో 25 సెం.మీ. వాన :24 గంటల్లో 20 సెం.మీ వర్షం కురిస్తే అమ్మో కుంభవృష్టి అనేవాళ్లం. ప్రస్తుతం ఒక్క రోజులో 25 సెం.మీ. వర్షం అనేది సాధారణంగా తయారైంది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో చాలా చోట్ల అతి, అత్యంత భారీ వర్షాలే నమోదు అవుతున్నాయి. గంట వ్యవధిలో 6 నుంచి 10 సెం.మీ. వర్షం కురుస్తున్న పరిస్థితులూ ఉన్నాయి. అది ఒకటి, రెండు ప్రాంతాలకే పరిమితమైతే వరద ప్రవాహం తక్కువే ఉంటుంది. కానీ వందల కిలో మీటర్ల విస్తృతిలో అత్యంత భారీగా వానలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తి ఊరూవాడా తేడా లేకుండా ముంచెత్తుతున్నాయి.
బంగాళాఖాతంలో పొంచి ఉన్న తుపానులు! - నవంబరు వరకు రాష్ట్రానికి గడ్డుకాలం - Storms in the Bay of Bengal
బుడమేరు, మునేరుకు వరద :తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్,సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు వంద కిలో మీటర్లకు పైగా విస్తృతిలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఏకంగా ముప్పై ప్రాంతాల్లో 25 సెం.మీ నుంచి 53 సెం.మీ వర్షం కురిసింది. అదే సమయంలో పొరుగునున్న ఎన్టీఆర్ జిల్లాలోనూ కుండపోత వానలు కురిశాయి. ఫలితంగానే బుడమేరు, మునేరుకు వరద పెరిగింది.
12 మండలాల్లో 50 సెం.మీ. పైగా వర్షం :మిగ్‌జాం తుపాను సమయంలో గత సంవత్సరం డిసెంబరు 2 నుంచి 5వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు అంటే 3 రోజుల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలే కురిశాయి. నాయుడుపేట, పెళ్లకూరు, బుచ్చినాయుడుకండ్రిగ, నెల్లూరు అర్బన్, చిల్లకూరు, కోట తదితర 12 మండలాల్లో 50 సెం.మీ. పైగా వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోనూ అప్పట్లో 24 గంటల్లోనే 25 సెం.మీ పైగా కురిసింది. తుపాన్లు, ద్రోణుల ప్రభావంతో అత్యంత భారీవర్షాలు కురిసే ప్రాంతాలే అత్యధికంగా ఉంటున్నాయి.
ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి :విరుచుకుపడుతున్న విపత్తులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్ధతా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. మన్యంలో అత్యంత భారీ వర్షాలతో ప్రజల జీవనమే ప్రశ్నార్థకంగా తయారవుతోంది. ఏ రాత్రి ఎటు నుంచి రాళ్లు, మట్టి, చెట్లతో కూడిన వరద ముంచెత్తుతుందో అనే భయాందోళనల మధ్య జనం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో ఎంత వర్షం కురుస్తుందో గుర్తించే పరిస్థితి లేదు. తెలుసుకునేలోగానే వరద ముంచేస్తోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో కొండలపై ఇళ్లు కట్టుకున్న వారికీ వాన కురుస్తుందంటే గుండె దడే! రాష్ట్ర ప్రభుత్వం నదీ పరీవాహకాలతో పాటు మైదాన, కొండ ప్రాంతాల్లోనూ వర్షపాతాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తం చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. విపత్తు సమయాల్లో వారికి తక్షణ సహాయం అందించేలా చూడాలి.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దేనికి ఖర్చు చేశారో? :పెరుగుతున్న విపత్తుల నేపథ్యంలో ఆర్థిక సంఘం సూచనల మేరకు కేంద్రం రాష్ట్రాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) కింద నిధుల్ని కేటాయిస్తుంది. ఇందులో కేంద్రం 75%, రాష్ట్రం 25% భరిస్తాయి. 2021-22 నుంచి 2025-26 వరకు ఏపీకి రూ.6,591 కోట్లు కేటాయించారు. 2021-22 నుంచి 2023-24 వరకు రూ.3,761 కోట్లు అందాయి. వివిధ రకాల విపత్తుల్ని ఎదుర్కొనేందుకు ఈ నిధుల్ని వినియోగించుకోవచ్చు. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దేనికి ఖర్చు చేశారో లెక్కలూ చెప్పలేని పరిస్థితి.
బంగాళాఖాతం ఉగ్రరూపం! - ఈ నైరుతిలో ఎనిమిది అల్పపీడనాలు - Review on Rains and Ocean Situation