270 Acres Land Scam in IT Corridor in Hyderabad : హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భారీస్థాయిలో భూ ఆక్రమణ జరిగింది. గండిపేట్ మండలంలో ఓ సొసైటీకి చెందిన 270 ఎకరాలను ఓ బడా రియల్ సంస్థ అధికారుల సహకారంతో అక్రమంగా ఛేజిక్కించుకుంది. వీటి ధర ప్రస్తుతం దాదాపు రూ.14 వేల కోట్లు ఉంటుందని అంచనా. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో లోపాలనే ఆసరా చేసుకుని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు, ఒక ఐఏఎస్ అధికారి సహకారంతో ఇదంతా మూడేళ్ల క్రితమే జరిగినట్లు తెలిసింది. భూములను కొనేందుకని స్థిరాస్తి సంస్థ షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటికి డబ్బులను సమకూర్చడానికి విదేశాల నుంచి ఆర్థిక లావాదేవీలను నిర్వహించినట్లు సమాచారం.
దీని గురించి కొన్ని నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందగా గోప్యంగా విచారణ చేపట్టింది. అదే సమయంలో దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కూడా కొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారాల్లో ప్రతిపక్ష పార్టీకి చెందని ఓ కీలక నేతకు సైతం సంబంధం ఉందన్న ఆరోపణలున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని ఉస్మాన్‌సాగర్ సమీపంలో ఉన్న 450 ఎకరాల పట్టా భూములను 40 ఏళ్ల క్రితం ఓ సొసైటీ ఇద్దరు వ్యక్తుల నుంచి కోనుగోలు చేసింది. అయితే ఇందులో ఉన్న మూడు వేల మంది సభ్యలు రిజిస్ట్రేషన్ సైతం చేసుకున్నారు.
ధరణి రాకతో బిగుసుకున్న ముడి :ఐదారేళ్ల తర్వాత ఆ పట్టా భూములను ప్లాట్లుగా మార్చుకునేందుకు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసున్నారు. అయితే జీవో 111 పరిధిలో ఉన్న భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు నిరాకరించారు. వీరి భూముల చుట్టుపక్కల ఓఆర్ఆర్, ఐటీ కారిడార్ రావడంతో సొసైటీ సభ్యుల మళ్లీ 2014లో రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అధికారులు మళ్లీ పాత సమాధానమే చెప్పడంతో వారంతా కోర్టును ఆశ్రయించగా తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. ఐదేళ్ల క్రితం గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చాక సొసైటీ సభ్యులకు సమస్యలు మొదలయ్యాయి.
వారు కొనుక్కున్న భూములన్నింటినీ రెవెన్యూ అధికారులు ధరణిలోకి మార్చేటప్పుడు ప్రైవేటు పట్టా భూములుగా నమోదు చేశారు. దీంతో అవన్నీ విక్రేతల పేరిట ఉండిపోయాయి. పైగా ధరణి వెబ్సైట్లో పొసెషన్(ఆ భూముల్లో ప్రస్తుతం ఉన్నవారు) అన్న ఆప్షన్ లేకపోవడంతో సొసైటీ సభ్యుల పేర్లు రాలేదు. తామే ఆ భూములకు హక్కు దారులమంటూ బాధితులు విన్నవించినా ఎవరూ వినకపోవడంతో వారు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై నమోదైన కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఆ భూములను పీవోబీ(నిషేధిత) జాబితాలోకి చేర్చారు.