Begum Bazar Land Price Increased :తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్‌గా పేరుగాంచిన హైదరాబాద్ బేగంబజార్‌లో భూములు, భవనాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. వీధిని బట్టి గజానికి కనీసం రూ.20 లక్షల రూపాయలు, ప్రైమ్ ఏరియాల్లో రూ.25 లక్షల వరకు ధర పలుకుతోంది. గతంలో గజం భూమి ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు మాత్రమే ఉండగా, రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ సర్కార్ హయాంలో రూ.10 నుంచి రూ.20 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కూడా చదరపు అడుగు ధర రూ.70 నుంచి రూ.80 వేలు పలుకుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లోనూ చదరపు అడుగు రూ.20 వేలకు మించి లేదు. కానీ ఇక్కడ ఒక్కసారి అమాంతంగా ధరలు పెరగడం విశేషం.
భవిష్యత్‌లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. బేగంబజార్‌లో ఖాళీ స్థలం లేదు. పాతవి, శిథిలావస్థకు చేరిన భవనాలే ఇక్కడి యజమానులకు బంగారంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పాత వాటిని కూల్చి, కొత్త భవనాలను నిర్మించగా అక్కడక్కడ ఉన్న పాత భవనాలకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో స్థిరాస్తి వ్యాపారుల దృష్టి బేగంబజార్ వైపు మళ్లింది. పాత భవనాల అమ్మకాలపై నిత్యం ఆరా తీస్తున్నారు. అందరి కంటే ఎక్కువగా ఇస్తామంటూ పోటీ పడుతున్నారు. ఒకరికి మించి మరొకరు రేటు పెంచుకుంటూ పోతుంటడంతో వ్యాపారుల మధ్య పోటీ వేలం పాటను తలపిస్తుందంటే అతిశ యోక్తి కాదు.
టాస్ ద్వారా భూముల విక్రయం : పలు సందర్భాల్లో కొనుగోలుదారుల ఒత్తిడి వల్ల యజమానులు టాస్ వేసి మరీ ఆ స్థలాన్ని అమ్ముతుండటం విశేషం. నిజాం హయాంలో రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన కొంతమంది వ్యాపారులు ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. వారి కుటుంబసభ్యులను రప్పించుకొని కిరాణ, జనరల్, డ్రై ప్రూట్స్, ఫ్లైవుడ్, స్టీల్, హార్డ్‌వేర్ విక్రయిస్తూ కుటుంబాలను పోషించుకున్నారు. చిన్నగా మొదలై క్రమంగా రూపాంతరం చెందడంతో బేజంబజార్ హోల్‌సేల్ వ్యాపారానికి కేంద్రంగా మారింది.