Story On Laknavaram Lake Tourism :లక్నవరం కొత్త అందాలతో రారమ్మంటూ సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. సరస్సులో బోటింగ్ ఇప్పటికే మధురానుభూతులు పంచుతుంటే తాజాగా అధునాతన సౌకర్యాలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన మూడో ద్వీపం అందాలు కట్టిపడేస్తున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించిన ఈ ఐలాండ్‌ని తిలకించేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు.
'గోవా'ను మరిపించే టూరిస్ట్ స్పాట్ :చుట్టూ పచ్చని చెట్లు ద్వీపాల మధ్యలో వంపులు తిరిగిన సరస్సు, నడుస్తుంటే కదలాడుతూ వింత అనుభూతి కలిగించే వేలాడే వంతెన. బస చేసేందుకు స్టార్ హోటల్ సదుపాయాలు స్విమ్మింగ్ పూల్‌లో స్నానాలు, నోరూరించే రుచులు ఇంతకంటే ఆహ్లాదం పొందడానికి ఇంకేం కావాలి. అందుకే లక్నవరం పర్యాటకులకు స్వర్గధామంలా మారిపోయింది. మాల్దీవులను గుర్తుకుతెచ్చే విధంగా లక్నవరం అందాలు పోటీ పడుతూ సందర్శకులను రారామ్మంటూ స్వాగతం పలుకుతున్నాయి. సహాజసిద్ధ అందాలకు నెలవైన ఈ ప్రదేశం పర్యాటకుల మదిని దోచేసే అద్భుత ప్రాంతంగా మారిపోయింది.
వరంగల్‌కు 78 కిలోమీటర్ల ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు అందాలు వీక్షించాలే కానీ మాటల్లో వర్ణించనలవి కాదు. చుట్టూ పచ్చదనంతో వరంగల్ నుంచి లక్నవరానికి వెళ్లే దారే చూపరులను కట్టిపడేస్తుంది. ఇక ఇక్కడ అడుగుపెట్టిన క్షణమే ఆహ్లాదకర వాతావరణం పరవశింపచేస్తుంది. వేలాడే ఊయల వంతెన చూసి మనసు ఊయలలూగుతుంది.