తెలంగాణ

telangana

ETV Bharat / state

చిక్కడూ.. దొరకడూ..! పోలీసులకు సవాల్​గా మారిన లగచర్ల ఘటన ప్రధాన నిందితుడి ఆచూకీ

పరారిలో ఉన్న లగచర్ల ప్రధాన నిందితుడు సురేశ్​ - పోలీసులకు సవాల్​గా మారిన సురేశ్ ఆచూకీ - ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

Lagacharla Accused Suresh Goes Missing
Lagacharla Accused Suresh Goes Missing (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Lagacharla Accused Suresh Goes Missing :కొడంగల్ లగచర్లలో అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేశ్ ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు ఛాలెంజ్​గా మారింది. దాడి జరిగిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిన అతడి ఆచూకీని ఆరు రోజులు దాటిన పోలీసులు కనిపెట్టలేకపోయారు. మహారాష్ట్రలోని పుణె ప్రాంతంలో తలదాచుకుని ఉంటాడని ఒక ప్రచారం ఉండగా హైదరాబాద్​లోనే రహస్య ప్రదేశంలో దాగి ఉంటాడని మరో ప్రచారం జరుగుతోంది.

ఓ పార్టీ నేతలు అతడిని పక్కా ప్రణాళికతో అజ్ఞాతంలోని పంపించి ఉంటారని, సెల్​ఫోన్ సైతం అందుబాటులో లేకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఆ నేతకు కుట్రలో భాగముందా? అనే విషయం తెలుసుకునేందుకు సురేశ్​ను విచారించడమే కీలకంగా మారింది. అయితే అతను పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్నాడు.. సురేశ్​ చిక్కితేనే ఈ ఘటనకు బాధ్యులు ఎవరనేది స్పష్టంగా తెలుస్తోంది.

కొంతమంది చేసిన తప్పునకు ఊరంతా బలి - ప్రశాంతంగా ఉండే లగచర్లకు ఆరోజు ఏమైంది?

వీడియోలు బాగోతం బట్టబయలు :కలెక్టర్ బృందాన్ని ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద నుంచి ఊరిలోను తీసుకెళ్లడంలో సురేశ్ కీలకంగా వ్యవహరించాడు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకురావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో అక్కడే ఉన్న సురేశ్ సైతం నినాదాలు చేసినట్లు వీడియోలో కనిపించడంతో ఆయనే పక్కా ప్లాన్​తో అధికారులను అక్కడికి రప్పించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ముందే ప్లాన్ చేసి ఉంటారని అనుమానం : అధికారులు వచ్చేసరికే వారిని రెచ్చగొట్టి దాడికి సిద్ధం చేసి ఉంటాడని.. కలెక్టర్ వాహనం దిగిన క్షణాల వ్యవధిలోనే అందోళనకారులు ఆయనపైకి దూసుకురావడంతో పాటు వెంకట్​రెడ్డిని వెంటాడి కొట్టేందుకు అదే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సెల్​ఫోన్​ను విశ్లేషించడంతో పాటు సురేశ్ వాంగ్మూలం కీలకమవుతుందని యోచిస్తున్నారు. సురేశ్​ అరెస్టయితే కానీ కేసు దర్యాప్తు వేగవంతం కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నం నరేందర్​ రెడ్డితో కలిపి మొత్తం 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్​కు పంపించారు.

లగచర్ల ఘటన అప్​డేట్​ - పోలీసుల అదుపులో మరో 8 మంది

'మాకు ఫార్మాకంపెనీ వద్దు - మా బతుకులు ఏదో మేము బతుకుతాం'

ABOUT THE AUTHOR

...view details