Lack of Facilities at Sports Ground in Telangana : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడల్ని ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామం, ఆవాసం, మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డులో గత ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన క్రీడా ప్రాంగణాల అసలు లక్ష్యం నెరవేరలేదు. మున్సిపాలిటీల్లో లక్ష్యం మేరకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయకపోగా ఏర్పాటైనట్లుగా అధికారులు చెబుతున్నా, అవి వినియోగంలోకి రాలేదు. దాదాపు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి . ఉమ్మడి పాలమూరు జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉండగా 385 వార్డుల్లో 434 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. తొలి విడతలో 44 ప్రాంగణాల్ని అన్ని హంగులతో ఏర్పాటు చేశారు. తర్వాత పట్టించుకున్న నాధుడే లేడు. అధికారులు పూర్తి చేసినట్లుగా చెబుతున్న ప్రాంగణాల్లో కనీస వసతులు లేవు. పేరుకు బోర్డులు తగిలించి ఖోఖో, వాలీబాల్ వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.
వీటిని చదును చేసి ఆ తర్వాత వదిలేయడంతో క్రీడా ప్రాంగణాలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. స్థలాలు లేక కొన్నిచోట్ల పాఠశాల మైదానాలకే బోర్డులు తగిలించి వదిలేశారు. వీటిని కనీసం ఎకరం స్థలంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా పావు ఎకరం స్థలంలోనే సర్దుబాటు చేశారు. అరకొర వసతులతో, ఆడుకునేందుకు అనుకూలంగా లేని వాటిని సిద్ధం చేసి బిల్లులు మాత్రం దండుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్రీడా ప్రాంగణాల పరిస్థితి గ్రామాల్లో ఇంకా తీసికట్టుగా ఉంది. ఉమ్మడి పాలముూరు జిల్లాలోని 2 వేల 278 గ్రామాలు, ఆవాసాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి. కానీ 20 శాతానికి పైగా గ్రామాల్లో ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. కారణం స్థలాభావం. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోవడం.
కొన్నిచోట్ల పాఠశాల మైదానాల్లోనే వాలీబాల్, ఖోఖో, కబడ్డీ లాంగ్ జంప్ కోర్టులు ఏర్పాటు చేసి మమ అనిపించారు. ఈ ప్రాంగణాల చుట్టూ మీటరు లోపు ఎత్తు పెరిగే మొక్కలు నాటాలి. అవేవీ లేకుండా తూతూ మంత్రం పనులు చేసినవే అధికం. కొన్ని ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో వాటిని ఎవరూ వాడటం లేదు. పూర్తైన క్రీడా ప్రాంగణాల కోసం రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కిట్లను సైతం అందించారు. వీటిలో క్రికెట్ కిట్, వాలీబాల్ కిట్, 75 టీ-షర్టులు, డంబెల్స్, డిస్కస్ త్రో, టెన్నీకాయిట్ రింగ్స్, స్కిప్పింగ్ రోప్స్, విజిల్స్, కొలతల టేపు లాంటివి ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 70 శాతం వరకూ కిట్లు పంపిణీ చేయగా 30 శాతం పంపిణీ చేయాల్సి ఉంది. పోనీ ఈ ప్రభుత్వంలో అవి పంపిణీ చేసినా ప్రాంగణాలు సరిగా లేకపోడంతో వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలని యువత ప్రశ్నిస్తున్నారు.
Players Facing for lack of Facilities for Sports Ground : ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగణాలు సౌకర్యాలు లేక వెక్కిరిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఒక ఎకరం స్థలంలో క్రీడాప్రాంగణాలు నిర్మించాల్సి ఉండగా వెయ్యి గజాల్లోనే ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల సరైన స్థలాలు లేక బడి ఆవరణల్లోనే నెలకొల్పారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,475 గ్రామాలకు 610 గ్రామాల్లో 361 ఎకరాల భూమిని గుర్తించారు. సూర్యాపేటలో 679 గ్రామాలకు 322 గ్రామాల్లో 165 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 650 గ్రామాలకు 379 గ్రామాల్లో 177 ఎకరాల స్థలాన్ని 2022లో అధికారులు గుర్తించారు. క్రీడా ప్రాంగణాల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు.
ప్రస్తుతం నిరుపయోగంగా మారిన క్రీడా ప్రాంగణాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని జిల్లా పంచాయతీ అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో క్రీడా ప్రాంగణాలు అన్యక్రాంతం అవుతున్నాయని వాటిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. అటు క్రీడా మైదానాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని అంటున్నారు. మరికొన్ని చోట్ల మైదానాలు ఉన్నా పిచ్చిమొక్కలు పెరిగాయి. కొన్నిచోట్లు కనీస సౌకర్యాలు, శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులు లేకపోవడంతో క్రీడా మైదానాలు నిరుపయోగంగా మారాయి. ఈ సందర్భంలో క్రీడా సామగ్రి సరఫరా చేసినా యువత, పిల్లలు ఆడుకునే పరిస్థితి లేదు. తాము ప్రస్తుతం ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నా పట్టించుకునే వారు లేరని యువత వాపోతున్నారు. వెంటనే క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.