Balamrutham Nutrition Food for Children :నేటి బాలలే - రేపటి పౌరులు. పిల్లలను ఇప్పటి నుంచే ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి. పెరుగుతున్న సమయంలో వారికి సరైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం చాలా ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇదే ఉద్దేశంతో చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తోంది. ఇందుకు కోసం ప్రత్యేకంగా బాలామృతం పంపిణీ చేస్తోంది. అవగాహన లోపంతో కొందరు సరైన మోతాదులో పిల్లలకు అందించకపోవడం, మరికొంతమంది దీన్ని వినియోగించుకోవడం లేదు.
ఉమ్మడి వికారాబాద్, మెదక్ జిల్లాలోని అంగన్వాడీలో నమోదైన చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులకు ప్రత్యేకంగా పోషక విలువలు ఉండే బాలామృతం ఇస్తున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్ అందిస్తూ సాధారణ బరువుకు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.
'చిన్నారులకు బాలామృతం తినిపిస్తే వారి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఇప్పటికే చాలా మందికి అవగాహన కల్పిస్తున్నాం. మూడేళ్లలోపు పిల్లలకు అయితే తప్పనిసరిగా బాలామృతం తినిపించాలని తల్లులకు సూచిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బాలామృతాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నాం. బరువు తుక్కువ ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్‌ను అందిస్తున్నాం'- లలిత కుమారి, సంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారిణి