Kuwait Victim Daughter Appeal: తన తండ్రి కువైట్లో కష్టాలు పడుతున్నాడంటూ 11 ఏళ్ల చిన్నారి కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వ పెద్దలు స్పందించి తన తండ్రిని విడిపించాలని వేడుకుంది. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివ కువైట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఓ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు.
ఎడారిలో గొర్రెలు మేకలు, కుక్కలు, కోళ్లు, బాతులు, పావురాలకు కాపలాగా పెట్టినట్లు అందులో పేర్కొన్నాడు. చుట్టుపక్కల కనుచూపు మేరలో ఎవరూ లేరన్నారు. మొత్తం పని అంతా తానొక్కడితోనే చేపిస్తున్నారని, నిద్రాహారాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎడారిలో విష సర్పాలు అధికంగా ఉన్నాయని, చనిపోయినా ఎవరు పట్టించుకునే వారు లేరని కన్నీటి పర్యంతమయ్యాడు.
దయచేసి ఎవరైనా సాయం చేసి ఈ ఎడారి నుంచి తనను స్వదేశానికి తీసుకెళ్లాలని వీడియోలో పేర్కొన్నాడు. లేకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని అన్నాడు. తన బిడ్డలు గుర్తొస్తున్నారని, దయచేసి ఎవరైనా సహాయం చేయాలని వేడుకున్నాడు. స్వదేశానికి తీసుకెళ్లాలని ఏజెంట్‌కి చెబితే, అదనంగా డబ్బు చెల్లించాలని చెబుతున్నాడని పేర్కొన్నాడు. అయితే అంత డబ్బు తన దగ్గర లేదని విలపించాడు. ఏజెంట్ తనను కువైట్‌కి తీసుకెళ్లేటప్పుడు చెప్పిన పని ఒకటి, ఇక్కడకు వచ్చాక చేపిస్తున్న పని మరొకటి అని బోరుమన్నాడు. ఎవరైనా తనను కాపాడాలని ప్రాధేయ పడ్డాడు.
Imran stuck in Dubai: చిత్రహింసలు పెడుతున్నారు రక్షించండి.. దుబాయ్‌లో ఆదోని యువకుడి ఆవేదన